
Shikhar Dhawan : టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డారు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్‌తో ఆయన ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరుపుకున్నారు. ఈ విషయాన్ని శిఖర్ ధావన్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “చిరునవ్వుల నుంచి కలల వరకు.. మేము ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. మా నిశ్చితార్థం సందర్భంగా మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ ఆయన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గతేడాది మే నెలలోనే వీరిద్దరూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ధావన్ మనసు దోచుకున్న ఈ సోఫీ షైన్ ఎవరో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె ఐర్లాండ్‌కు చెందిన ఒక ప్రొడక్ట్ కన్సల్టెంట్. ప్రస్తుతం యూఎస్ కేంద్రంగా పనిచేసే నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్ అనే ఆర్థిక సేవల సంస్థలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సోఫీ ఐర్లాండ్‌లోని లిమ్రిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. వీరిద్దరికీ యూఏఈలో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయమే ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని సమాచారం.
నిజానికి శిఖర్ ధావన్, సోఫీ గత కొంతకాలంగా చాలా బహిరంగంగానే కనిపిస్తున్నారు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. అలాగే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ధావన్ ఆడుతున్నప్పుడు సోఫీ స్టేడియంలో ఉండి మరి తన ప్రియుడిని ఉత్సాహపరిచేది. ధావన్ చేసే ఫన్నీ రీల్స్, వీడియోలలో కూడా ఆమె తరచుగా కనిపిస్తూ ఉండేది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. వీరిద్దరూ వచ్చే ఫిబ్రవరి నెలలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది.
శిఖర్ ధావన్ గతంలో అయేషా ముఖర్జీని 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి జోరావర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా వీరు 11 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2023 అక్టోబర్‌లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. గతంలో ధావన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కొడుకు జోరావర్‌ను చూసి చాలా రోజులైందని, అతడితో టచ్‌లో లేనని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధాకరమైన రోజుల నుంచి బయటపడిన గబ్బర్, ఇప్పుడు సోఫీతో కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడంపై అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..