
Mohammed Shami : కొత్త ఏడాదిలో టీమిండియా మొదటి సమరానికి సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం శనివారం (జనవరి 3) భారత జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే ఈ సెలక్షన్ కమిటీ భేటీలో అందరి దృష్టి ఒక్కరి మీదే ఉంది.. ఆయనే వెటరన్ స్పీడ్ గన్ మహమ్మద్ షమీ. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన షమీ, మళ్ళీ నీలి రంగు జెర్సీని ధరిస్తాడా? లేదా అనేది ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల ప్రశ్న.
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ శనివారం ఆన్‌లైన్ మీటింగ్ ద్వారా 3 వన్డేల సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనుంది. ఈ సిరీస్ లో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ పై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇలాంటి కీలక సమయంలో సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ ఫిట్‌నెస్ మీద అగార్కర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇద్దరి మధ్య పరోక్షంగా వాగ్వాదం కూడా జరిగింది. కానీ షమీ తన పెర్ఫార్మెన్స్‌తో అగార్కర్‌కు గట్టి సమాధానమే ఇచ్చాడు.
గత మూడు నాలుగు నెలలుగా షమీ దేశవాళీ క్రికెట్‌లో అగ్నిపరీక్షను ఎదుర్కొని అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీలో కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లోనే 18.60 సగటుతో 20 వికెట్లు పడగొట్టి తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 16 వికెట్లు, ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున 4 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లతో చెలరేగిపోతున్నాడు. ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్ విషయంలో కూడా షమీ ఇప్పుడు టాప్ గేర్‌లో ఉన్నాడు. సెలక్టర్లు అతన్ని కాదనడానికి ఇప్పుడు ఒక్క కారణం కూడా కనిపించడం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లు నిరంతరాయంగా క్రికెట్ ఆడుతున్నారు. వీరికి వరల్డ్ కప్ ముందు విశ్రాంతి ఇవ్వడం టీమిండియాకు చాలా అవసరం. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి షమీ కంటే ఉత్తమమైన బౌలర్ మరొకరు లేరు. కివీస్‌పై షమీకి మంచి రికార్డు ఉంది. అంతేకాకుండా, సీనియర్ ఆటగాడికి ఇచ్చే గౌరవం ప్రకారం కూడా అతన్ని వన్డే జట్టులోకి తీసుకోవడం సముచితంగా ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్ లో షమీ రాణిస్తే, వరల్డ్ కప్ రేసులో కూడా అతను నిలిచే అవకాశం ఉంటుంది.
అజిత్ అగార్కర్, షమీ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, భారత క్రికెట్ ప్రయోజనాల కోసం సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే ఫార్మాట్‌లో షమీ అనుభవం కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడానికి ఎంతో అవసరం. జనవరి 3న వెలువడనున్న అధికారిక ప్రకటనలో షమీ పేరు ఉంటుందో లేదో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. షమీ తిరిగి వస్తే మాత్రం భారత బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందనడంలో సందేహం లేదు.