Shah Rukh Khan : 100 రోజుల్లోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం.. ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ కొత్త క్రికెట్ స్టేడియం 100 రోజుల్లో పూర్తి కావడంతో జై షాకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి ఈ స్టేడియం కీలక మైలురాయిగా నిలవనుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

Shah Rukh Khan : 100 రోజుల్లోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం.. ఐసీసీ చైర్మన్ జై షాకు  ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
Shah Rukh Khan

Updated on: Jul 02, 2026 | 11:28 AM

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యజమాని షారుఖ్ ఖాన్ ప్రపంచ క్రికెట్ సామ్రాజ్యంలో మరో కీలక మైలురాయిని అందుకున్నారు. అమెరికాలో ఆయనకు స్వంతమైన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్(LAKR) జట్టు కోసం నిర్మించ తలపెట్టిన సరికొత్త క్రికెట్ స్టేడియం పనులు పూర్తయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ పరిధిలో ఉన్న పోమోనా నగరంలో ఈ స్టేడియం రూపుదిద్దుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ స్టేడియం నిర్మాణాన్ని ఇంజనీర్లు రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. అమెరికన్ క్రికెట్ చరిత్రలో ఇదొక విప్లవాత్మక అడుగు అని, భవిష్యత్తులో జరగబోయే ఒలింపిక్స్ క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఇదే వేదికపై నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ అద్భుతమైన స్టేడియం సిద్ధమైన సందర్భంగా షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా నిర్మాణానికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఒకప్పుడు తాను కన్న కల.. నేడు కళ్లముందే నిజమై నిలిచిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రయాణంలో తనకు ఎంతగానో సహకరించిన ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షాకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మైదానం కేవలం క్రికెట్ ఆడేందుకే పరిమితం కాదని, ఇక్కడికి వచ్చే కుటుంబాలకు, అభిమానులకు ఇదొక గొప్ప వినోద వేదికగా మారుతుందని, ఎన్నో తీపి జ్ఞాపకాలను అందిస్తుందని కింగ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తన అధికారిక ఎక్స్ ఖాతాలో షారుఖ్ ఖాన్ రాస్తూ.. “ఒకప్పుడు కేవలం ఆలోచనగా ఉన్న కల, ఈరోజు వాస్తవరూపం దాల్చింది. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్‌లోకి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ ప్రాజెక్ట్ కేవలం క్రీడల కోసమే కాదు, కుటుంబాలు కలిసి ఆనందించేలా, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను పంచుకునేలా తీర్చిదిద్దాం. ఈ జర్నీలో నాకు అడుగడుగునా అండగా నిలిచిన జైభాయ్ (జై షా)కు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎంతో సహకరించిన సంజోగ్ గుప్తాకు కూడా థాంక్స్. ఇది లాస్ ఏంజిల్స్ ప్రజల కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైట్ రైడర్స్ కుటుంబం కోసం నిర్మించింది. పర్పల్ అండ్ గోల్డ్ కలర్‌పై నమ్మకం ఉంచండి” అంటూ పోస్ట్ పెట్టారు.

కేవలం వంద రోజుల్లోనే ఇంత పెద్ద అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించడం వెనుక భారీ శ్రమ దాగి ఉంది. ఈ గ్రౌండ్‌ను చదును చేయడానికి, సిద్ధం చేయడానికి దాదాపు 32 వేల మెట్రిక్ టన్నుల మట్టిని అక్కడి నుంచి తొలగించినట్లు మేనేజ్‌మెంట్ పేర్కొంది. ప్రస్తుతం మొదటి దశ పనులు పూర్తి కాగా, రెండో దశ పనుల కింద అత్యాధునిక డ్రైనేజీ సిస్టమ్, విదేశీ ఆటగాళ్లకు అవసరమైన ప్రాక్టీస్ నెట్స్, వినూత్నమైన వినోద సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. అమెరికాలో క్రికెట్‌ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎల్‌ఏ నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ ఎంతగానో ఉపయోగపడనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us