
Ind Vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు(బుధవారం) రాజకోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. అయితే టీమిండియాను గాయాల సమస్య వేధిస్తోంది. తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఢిల్లీ యువ ఆటగాడు ఆయుష్ బదోనీని జట్టులోకి తీసుకున్నారు.
2027 వరల్డ్ కప్ సౌతాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్‌లు పేస్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, ఇప్పటి నుంచే నితీష్ కుమార్ రెడ్డి వంటి పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లను సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రాజకోట్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం అయినప్పటికీ, నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని భారత్ అనుకుంటే నితీష్ రెడ్డికి తుది జట్టులో అవకాశం ఖాయం. ఒకవేళ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావాలనుకుంటే మాత్రం బదోనీ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
వడోదర వన్డేలో 93 పరుగుల వద్ద అవుట్ అయి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న విరాట్ కోహ్లీపై అందరి కళ్లు ఉన్నాయి. కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజకోట్ పిచ్ సాధారణంగా ఫ్లాట్ గా ఉండి పరుగులు పారడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో కోహ్లీ ఒక్క వన్డే సెంచరీ కూడా చేయలేదు. ఈసారి ఆ లోటును తీర్చి తన 54వ వన్డే సెంచరీని నమోదు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కివీస్ జట్టులో కైల్ జేమిసన్ తన ఎత్తుతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు, అతనిపై మనవాళ్లు ఎలా విరుచుకుపడతారో చూడాలి.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి/ఆయుష్ బదోనీ, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..