
Sarfaraz Khan: టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆటగాడికి జాతీయ జట్టులో అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనికి తోడు గతంలో అతడు ఎదుర్కొన్న ఓ వివాదం కూడా తీవ్రంగా బాధించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన విషయాలను బయటకు లీక్ చేశాడంటూ తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో ఎదురైన పరిస్థితులను తాజాగా సర్ఫరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు దగ్గరగా ఉన్నవాళ్లు కూడా ఫోన్లు ఎత్తలేదని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
డ్రెస్సింగ్ రూమ్ లీకుల ఆరోపణలతో మనస్తాపం
మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నిర్వహిస్తున్న బైఠ్ ఔర్ బోల్ కార్యక్రమంలో సర్ఫరాజ్ ఖాన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలో ఎదురైన కష్టకాలం గురించి మాట్లాడాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో తనకు గాయమైందని, దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకునేందుకు శిక్షణ తీసుకుంటున్నానని చెప్పాడు. ఆ సమయంలోనే డ్రెస్సింగ్ రూమ్ విషయాలను బయటకు చేరవేస్తున్నాడంటూ తనపై వార్తలు రావడం మొదలైందని తెలిపాడు. విమానం దిగి బయటకు రాగానే ఫోన్లు, మెసేజ్‌లు రావడంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ విషయం ప్రచారంలోకి వచ్చిందని వివరించాడు.
అసలు అలాంటి పని ఎందుకు చేస్తాను?
తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా బాధించాయని సర్ఫరాజ్ చెప్పాడు. తాను అలాంటి పని చేసి ఉంటే మళ్లీ ఇండియా-ఏ జట్టులోకి ఎలా ఎంపికయ్యేవాడినని ప్రశ్నించాడు. ఇటీవల శ్రీలంక పర్యటనకు కూడా వెళ్లానని గుర్తు చేశాడు. అసలు ఈ వార్తలు ఎలా వచ్చాయో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. ఆ సమయంలో తన మనసు ఎంతో బాధపడిందని, ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చాడు.
ఫోన్లు ఎత్తని సన్నిహితులు
ఈ వివాదం తనకంటే కుటుంబ సభ్యుల్ని ఎక్కువగా బాధించిందని సర్ఫరాజ్ వెల్లడించాడు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, వాటిని భరించే శక్తి తనకు ఉందని చెప్పాడు. కానీ తండ్రి బాధపడటం, భార్య ఏడవటం చూసి తట్టుకోలేకపోయానని భావోద్వేగానికి గురయ్యాడు. తల్లి, సోదరుడు కూడా ఆ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో పెద్ద వివాదంగా మారిపోతుందని చెప్పాడు.
రెండు రోజుల తర్వాత గంభీర్ నుంచి ఫోన్
ఆ కష్టకాలంలో తనకు మొదటగా ఫోన్ చేసిన వ్యక్తి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని సర్ఫరాజ్ వెల్లడించాడు. ఆరోపణలు వచ్చిన రెండు రోజుల తర్వాత గంభీర్ తనకు ఫోన్ చేశారని తెలిపాడు. ఆటపై దృష్టి పెట్టాలని, ఇలాంటి విషయాలను పట్టించుకోవద్దని సూచించారని చెప్పాడు. అవన్నీ క్రికెట్‌లో ఉండే రాజకీయాలేనని ధైర్యం చెప్పినట్లు వివరించాడు. తన తండ్రి బాధపడుతున్నారని, భార్య ఏడుస్తోందని గంభీర్‌కు చెప్పినప్పుడు ఆయన నేరుగా తన తండ్రితో కూడా మాట్లాడారట. సర్ఫరాజ్ మంచి క్రికెటర్ అని, అతడిని ప్రశాంతంగా క్రికెట్ ఆడనివ్వాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన ధైర్యం తనకు ఎంతో అండగా నిలిచిందని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..