Sanju Samson: సంజూ వర్సెస్ వైభవ్.. 2028 టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ ఎవరిది? శాంసన్ ఏమన్నాడంటే!

Sanju Samson: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్ పోటీపై సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అఫ్ఘానిస్తాన్‌తో రెండో టీ20లో 22 బంతుల్లో 57 పరుగులతో అదరగొట్టిన సంజూ, వ్యక్తిగత పోటీ కంటే దేశమే ముఖ్యమని స్పష్టం చేశాడు. 2028 టీ20 ప్రపంచకప్‌లో ఓపెనింగ్ స్థానంపై ఇప్పటినుంచే ఆసక్తికర చర్చ మొదలైంది.

Sanju Samson: సంజూ వర్సెస్ వైభవ్.. 2028 టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ ఎవరిది? శాంసన్ ఏమన్నాడంటే!
Sanju Samson Vs Vaibhav Suryavanshi

Updated on: Sep 16, 2026 | 12:29 PM

Sanju Samson: 2028 టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే టీమిండియా ఎలా ఉండబోతుందనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు. అయితే జట్టు ఎంపికలో ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్ ఎవరికి దక్కుతుందనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలోనూ సంజు శాంసన్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కగా, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు తనకు గట్టి పోటీదారులుగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సంజు శాంసన్ చాలా మెచ్యుర్డ్ గా బదులిచ్చారు. మనమంతా దేశం కోసమే ఆడుతున్నామని, దేశమే ఎప్పుడూ ముందుంటుందని ఆయన తేల్చిచెప్పారు.

రికార్డు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన సంజు

పోటీ ఎంత ఉన్నప్పటికీ సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీల మధ్య ఓపెనింగ్ స్థానం కోసం గట్టి పోరు సాగుతోందన్నది కాదనలేని నిజం. మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించారు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 57 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దేశమే మా మొదటి ప్రాధాన్యత

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో సంజు శాంసన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “బయట ప్రపంచానికి వైభవ్, అభిషేక్‌లు నాకు పోటీదారులుగా అనిపించవచ్చు. కానీ మేమందరం ఒకే జట్టుగా దేశం కోసం ఆడుతున్నాం. ముందుగా మ్యాచ్ గెలవడం ముఖ్యం, ఆ తర్వాతే పర్సనల్ విషయాలు” అని ఆయన పేర్కొన్నారు. ఎవరికి అవకాశం దక్కింది, తనకు ఎందుకు రాలేదు అని ఆలోచించి అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదని, అలాంటి సంస్కృతి టీమిండియాలో ఉండదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా విమర్శలపై శాంసన్ స్పందన

వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి, ముఖ్యంగా జింబాబ్వే టూర్‌లో రెండు హాఫ్ సెంచరీలు బాదిన తర్వాత, చాలా మంది సంజు కంటే వైభవ్‌కే ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ స్థానంలో వైభవ్ రావాలన్నారు. సోషల్ మీడియా, మాజీ క్రికెటర్ల విమర్శలపై స్పందిస్తూ.. తాను సాధారణంగా ఇంటర్నెట్, వైఫైకి దూరంగా ఉంటానని, కొన్నిసార్లు అనుకోకుండా వార్తలు కంట పడుతుంటాయని చెప్పారు. భారతీయ క్రికెటర్లు మానసికంగా ఎంతో బలంగా ఉండాలని, బయట జరిగే చర్చలు ఆటపై ప్రభావం చూపకుండా చూసుకుంటామని శాంసన్ తెలిపారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us