
Sanath Jayasuriya : శ్రీలంక మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన సనత్ జయసూర్య పేరు తెలియని వారుండరు. తన విధ్వంసక బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. అలాగే, తన స్పిన్ బౌలింగ్‌తో ఎన్నో కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందించాడు. 1996లో శ్రీలంక ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆయన క్రికెట్ కెరీర్ ఎంత గొప్పగా ఉందో, ఆయన వ్యక్తిగత జీవితం అంతగా గందరగోళంగా ఉంది. 56 ఏళ్ల జయసూర్య మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ, ఆ మూడు బంధాలు విఫలమయ్యాయి. ముఖ్యంగా, మూడో భార్యతో ఆయనకు ఎదురైన అనుభవం ఆయన జీవితంలో ఒక వివాదాస్పద అధ్యాయాన్ని మిగిల్చింది.
జయసూర్య తొలిసారి 1998లో ఎయిర్ శ్రీలంకలో గ్రౌండ్ హోస్టెస్‌గా పనిచేస్తున్న సుముద్ కరుణానాయకేను పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ బంధం కొన్ని నెలల్లోనే తెగిపోయింది. తన క్రికెట్ కెరీర్‌కు ఈ పెళ్లి అడ్డంకిగా మారిందని, తన భార్య తనను వదిలేసిందని జయసూర్య అప్పట్లో మీడియాకు చెప్పాడు. ఈ విడాకుల వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని కూడా వెల్లడించాడు.
తొలి పెళ్లి విఫలమైన తర్వాత, జయసూర్య 2000లో సాండ్రా డిసిల్వా అనే ఫ్లైట్ అటెండెంట్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు – సావింది, యాలిండి, రోనక్ – జన్మించారు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. 2012లో ఈ ఇద్దరు విడిపోయారు. ఆ సమయంలో జయసూర్యకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి.
రెండో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత, జయసూర్య నటి, మోడల్ అయిన మలికా సిరిసేనను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. 2012 ఫిబ్రవరిలో మౌంట్ లావినియాలోని ఓ బౌద్ధ ఆలయంలో వీరి వివాహం జరిగింది. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. జయసూర్యను వదిలేసి మలికా మరో వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. దీంతో జయసూర్య తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. 2017లో జయసూర్య, మలికాల ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోను జయసూర్యనే లీక్ చేశాడని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జయసూర్య ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.
వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా, జయసూర్య క్రికెట్ కెరీర్ మాత్రం అద్భుతంగా సాగింది. సనత్ జయసూర్య తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించారు. 110 టెస్టుల్లో 6973 పరుగులు, 445 వన్డేల్లో 13430 పరుగులు చేశారు. వన్డేల్లో 28 సెంచరీలు చేసి, అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 440 వికెట్లు తీశారు. 2011లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అయితే, ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ సంఘటనలు ఆయన లెజెండరీ కెరీర్‌పై ఒక మచ్చలా మిగిలిపోయాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..