Video: 39 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి మరీ రనౌట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్..!

Rohit Sharma Stunning Run Out: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫీల్డింగ్‌తో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు. 39 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన చురుకుదనం చూపిస్తూ న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను రనౌట్ చేశాడు. గాల్లోకి ఎగురుతూ అతడు విసిరిన త్రో ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

Video: 39 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి మరీ రనౌట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్..!
Rohit Shamra Run Out Video

Updated on: Nov 04, 2026 | 11:33 AM

Rohit Sharma Stunning Run Out: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వయసు, ఫిట్‌నెస్‌పై తరచూ చర్చ జరుగుతుంటుంది. 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడు ఆడతాడా? యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి రిటైర్మెంట్ ప్రకటించాలా? అంటూ కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ తన ఫీల్డింగ్‌తో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 39 ఏళ్ల హిట్‌మ్యాన్ అద్భుతమైన చురుకుదనం ప్రదర్శించాడు. గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో బంతిని అందుకుని, క్షణాల్లో వికెట్ల వైపు త్రో విసిరాడు. అతడి మెరుపు ఫీల్డింగ్ కారణంగా ప్రమాదకర బ్యాటర్ డారిల్ మిచెల్ రనౌట్ అయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

22వ ఓవర్లో రోహిత్ అద్భుతం..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలిసారి అక్షర్ పటేల్‌ను బౌలింగ్‌కు దించాడు. ఆ ఓవర్ తొలి బంతిని గ్లెన్ ఫిలిప్స్ లెగ్ సైడ్ వైపు ఆడాడు. సింగిల్ కోసం ప్రయత్నించే క్రమంలో కాసేపు తడబడ్డాడు. అయితే అప్పటికే మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ బంతిని అందుకుని వేగంగా స్పందించాడు.

గాల్లోకి ఎగురుతూ మెరుపు త్రో..

రోహిత్ బంతిని అందుకున్న వెంటనే గాల్లోకి ఎగురుతూ అండర్ ఆర్మ్ త్రో విసిరాడు. బంతి నేరుగా వికెట్ల వైపు వెళ్లింది. వికెట్ల వెనుక ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) బంతిని అందుకుని బెయిల్స్ పడగొట్టాడు. క్రీజులోకి చేరేందుకు డారిల్ మిచెల్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రీప్లేలో అతడు స్వల్ప తేడాతో క్రీజుకు దూరంగా ఉన్నట్లు తేలింది.

డారిల్ మిచెల్‌కు అరుదైన రనౌట్..

డారిల్ మిచెల్ (Daryl Mitchell) న్యూజిలాండ్ జట్టులో కీలక బ్యాటర్. భారత్‌పై అతడికి మంచి రికార్డు ఉంది. భారత్‌పై చేసిన తొమ్మిది వన్డే సెంచరీల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. అలాంటి ప్రమాదకర ఆటగాడిని రోహిత్ అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు పంపించాడు. వన్డే క్రికెట్‌లో మిచెల్ తొలిసారిగా రనౌట్ కావడం ఈ ఘటనలో మరో విశేషం.

రోహిత్ ఫిట్‌నెస్‌పై విమర్శలకు సమాధానమా?

రోహిత్ శర్మ వయసు, ఫిట్‌నెస్‌పై చర్చ కొత్తేమీ కాదు. ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో 2027 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ జట్టులో కొనసాగాలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే రోహిత్ అనుభవం, బ్యాటింగ్ సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. అతడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆటగాడికే వదిలేయాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా మ్యాచ్‌లో చేసిన అద్భుత రనౌట్‌తో రోహిత్ ఇంకా ఫీల్డింగ్‌లో తన సత్తా చాటగలనని నిరూపించాడు. హిట్‌మ్యాన్ అభిమానులు మాత్రం 2027 ప్రపంచకప్‌లోనూ అతడిని చూడాలని కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us