AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajat Patidar : ఐపీఎల్‌లో ఎంత బాదినా భారత జట్టులో పటిదార్‌కు చోటు కష్టమే ? ఆ మూడు బలహీనతలే అతనికి శాపం

Rajat Patidar : పలువురు మాజీ క్రికెటర్లు పటిదార్‌ను వెంటనే భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఐపీఎల్‌లో ఎంత బాగా ఆడినా.. ప్రస్తుతానికి టీమిండియా టీ20 సెటప్‌లో అతనికి శాశ్వత స్థానం దక్కడం అంత సులువు కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

Rajat Patidar : ఐపీఎల్‌లో ఎంత బాదినా భారత జట్టులో పటిదార్‌కు చోటు కష్టమే ? ఆ మూడు బలహీనతలే అతనికి శాపం
Rajat
Rakesh
|

Updated on: May 27, 2026 | 7:29 PM

Share

Rajat Patidar : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రజత్ పటిదార్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తన అగ్రెసివ్ బ్యాటింగ్, భయం లేని షాట్లతో ఆర్సీబీని ఒంటిచేత్తో ఐపీఎల్ 2026 ఫైనల్‌కు చేర్చిన పాటిదార్ ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ముఖ్యంగా ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే 281.82 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 93 పరుగులు చేసి అందరి మైండ్ బ్లాక్ చేశాడు. ఈ సీజన్ మొత్తంలో 13 ఇన్నింగ్స్‌ల్లో 44.18 సగటుతో, 196.76 అల్ట్రా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 486 పరుగులు సాధించాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఊచకోత కోస్తూ 203.97 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.

ఈ అద్భుతమైన ఫామ్ చూసిన అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు పటిదార్‌ను వెంటనే భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఐపీఎల్‌లో ఎంత బాగా ఆడినా.. ప్రస్తుతానికి టీమిండియా టీ20 సెటప్‌లో అతనికి శాశ్వత స్థానం దక్కడం అంత సులువు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి గల ప్రధాన కారణాలు, సెలెక్టర్ల ఆలోచనల వెనుక ఉన్న లోతైన సమీక్షను ఇప్పుడు వివరంగా చూద్దాం.

1. ఐపీఎల్ వేరు.. ఇంటర్నేషనల్ క్రికెట్ వేరు

రజత్ పాటిదార్ ఐపీఎల్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన మాట వాస్తవమే అయినా, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోవడంలో అతను గతంలో ఘోరంగా విఫలమయ్యాడు. 2022-23 రంజీ ట్రోఫీలో 565 పరుగులు చేసి పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి భారత టెస్ట్ జట్టులో అవకాశం దక్కింది. ఫిబ్రవరి 2024 లో ఇంగ్లాండ్‌పై వైజాగ్ వేదికగా టెస్ట్ అరంగేట్రం చేసిన పటిదార్.. 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 10.50 సగటుతో 63 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అలాగే దక్షిణాఫ్రికాతో ఆడిన ఏకైక వన్డే మ్యాచ్‌లోనూ 22 పరుగులకే అవుటయ్యాడు.

ఇక టీ20 ఫార్మాట్‌లోనూ అతని స్థిరత్వంపై నీలినీడలు ఉన్నాయి. గత ఏడాది 2025 సీజన్ లో 21 టీ20 ఇన్నింగ్స్‌లలో కేవలం 21.3 సగటుతో 425 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ట్రాక్ రికార్డ్ చూస్తున్న సెలెక్టర్లు.. ప్రస్తుత ఐపీఎల్ 2026 ఫామ్‌ను ఒక తాత్కాలిక పర్పుల్ ప్యాచ్(కొద్దిరోజుల మెరుపు)గానే చూస్తున్నారు తప్ప, లాంగ్ రన్ స్థిరత్వంగా నమ్మలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలింగ్‌ను ఎదుర్కొనేటప్పుడు పాటిదార్ తడబడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి.

2. నంబర్ 3, 4 స్థానాల్లో విపరీతమైన పోటీ

టీమిండియా టీ20 జట్టులో రజత్ పాటిదార్‌కు చోటు దక్కకపోవడానికి రెండో అతిపెద్ద కారణం.. మిడిల్ ఆర్డర్‌లో ఉన్న విపరీతమైన పోటీ. ప్రస్తుతం భారత జట్టులో నంబర్ 3, నంబర్ 4 స్థానాల కోసం ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, దేవదత్ పడిక్కల్ వంటి స్టార్ ప్లేయర్లు కొట్లాడుకుంటున్నారు. టీ20లలో సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ ఛాయిస్ కాగా, యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ భయం లేని బ్యాటింగ్‌తో సెలెక్టర్ల మనసు గెలుచుకున్నాడు.

దీనికి తోడు, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. ఆధునిక టీ20 క్రికెట్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసే ఆటగాళ్ల కంటే.. బ్యాటింగ్‌తో పాటు పార్ట్-టైమ్ బౌలింగ్ చేయగల రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి మల్టీ-టాస్కింగ్ ఆల్‌రౌండర్లకే మేనేజ్‌మెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. రజత్ పాటిదార్ ప్యూర్ బ్యాటర్ కావడం, బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం అతనికి పెద్ద మైనస్‌గా మారింది. 2025 లో నంబర్ 3 లో ఆడినప్పుడు 19 సగటు, నంబర్ 4 లో 22.8 సగటు మాత్రమే ఉండటం కూడా టీమ్ కాంబినేషన్‌కు సెట్ కావడం లేదు.

3. పేస్ బౌలింగ్‌పై పట్టు సాధించాల్సిందే

రజత్ పాటిదార్ స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 2021 నుంచి 2026 వరకు స్పిన్‌పై అతని రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో 176.4 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 905 పరుగులు చేశాడు. కానీ పేస్ బౌలింగ్ (ఫాస్ట్ బౌలర్లు) విషయానికి వస్తే అతని ప్రదర్శనలో భారీగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. 2024 లో పేస్‌పై 15 మ్యాచ్‌ల్లో 23.3 సగటుతో 279 పరుగులు చేయగా.. 2025 లో మరింత ఘోరంగా 16.2 సగటుతో కేవలం 210 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఐపీఎల్ 2026 లో మాత్రం పేస్‌పై బాగా ఇంప్రూవ్ అయ్యి 60.3 సగటుతో 362 పరుగులు బాదాడు. అయితే సెలెక్టర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక చేసేముందు కేవలం ఒకే ఒక్క సీజన్ గణాంకాలను ప్రామాణికంగా తీసుకోరు. విదేశీ పిచ్‌లపై, గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే అంతర్జాతీయ పేసర్ల స్వింగ్, బౌన్స్‌ను పాటిదార్ ఎంతవరకు తట్టుకోగలడనేది ఇంకా నిరూపితం కావాల్సి ఉంది. కాబట్టి, పాటిదార్ మరికొంత కాలం దేశీ టోర్నీల్లో, రాబోయే సిరీస్‌లలో తన స్థిరత్వాన్ని నిరూపించుకుంటేనే టీమిండియా టీ20 తలుపులు తెరుచుకుంటాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us