IND vs SA 3rd ODI : క్వింటన్ డి కాక్ సునామీ..సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్

IND vs SA 3rd ODI : సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ భారత జట్టుపై తన అద్భుతమైన రికార్డును మరోసారి నిరూపించుకున్నాడు. విశాఖపట్నంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో డి కాక్ కేవలం 80 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించి తన జట్టుకు బలమైన పునాది వేశాడు.

IND vs SA 3rd ODI : క్వింటన్ డి కాక్ సునామీ..సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
Quinton De Kock Odi Century

Updated on: Dec 06, 2025 | 5:06 PM

IND vs SA 3rd ODI : సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ భారత జట్టుపై తన అద్భుతమైన రికార్డును మరోసారి నిరూపించుకున్నాడు. విశాఖపట్నంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో డి కాక్ కేవలం 80 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించి తన జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లలో డి కాక్ పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారత్‌పై వన్డేల్లో డి కాక్‌కు ఇది ఏడో సెంచరీ కావడం విశేషం.

సనత్ జయసూర్య ప్రపంచ రికార్డు బద్దలు

భారతదేశంపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును డి కాక్ ఈ సెంచరీతో బద్దలు కొట్టాడు. గతంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య భారత్‌పై 85 ఇన్నింగ్స్‌లలో 7 సెంచరీలు సాధించి ఈ ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. అయితే క్వింటన్ డి కాక్ కేవలం 24 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా ఏడు సెంచరీలు సాధించి జయసూర్య రికార్డును తుడిచిపెట్టాడు. భారత్‌తో ఆడిన తొమ్మిది సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేయగా, అందులో ఏడుసార్లు దానిని సెంచరీగా మలచడం డి కాక్ అత్యద్భుతమైన కన్వర్షన్ రేట్‌కు నిదర్శనం.

టాస్, జట్టు మార్పులు

ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ టాస్ విజయంతో, వన్డేల్లో భారత జట్టు వరుసగా 20 మ్యాచ్‌లలో టాస్ కోల్పోయిన పరంపరకు తెరపడింది. భారత జట్టు తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ ఆటగాడు తిలక్ వర్మను తుది జట్టులోకి తీసుకున్నారు. అటు దక్షిణాఫ్రికా జట్టు, గాయాల కారణంగా బాధపడుతున్న నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి స్థానంలో ర్యాన్ రికెల్టన్, ఓట్నీల్ బార్ట్‌మ్యాన్‌లను టీమ్‌లోకి తీసుకుంది.

నిర్ణయాత్మక పోరు

ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాంచీలో జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించగా, రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాబట్టి ఈ విశాఖపట్నంలో జరుగుతున్న మూడో వన్డే ఇరు జట్లకు సిరీస్ విజేతను నిర్ణయించే నిర్ణయాత్మక పోరుగా మారింది. ఈ కీలక మ్యాచ్‌లో డి కాక్ శతకం దక్షిణాఫ్రికాకు భారీ ఊరటనిచ్చింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..