
ICC World Cup 2027: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కేప్ టౌన్ వేదికగా అత్యంత వైభవంగా ఆవిష్కరించింది. ఈ ప్రధాన ఘట్టంతో ఈ మెగా టోర్నీకి సరిగ్గా ఒక ఏడాది కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలోనే అధికారికంగా మ్యాచ్‌ల తేదీలతో పాటు టికెట్ల కేటాయింపు ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఈసారి 2027 వన్డే వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటుండగా, 12 వేదికలపై 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక టోర్నమెంట్ ఫార్మాట్‌లోనూ ఐసీసీ కొన్ని కీలక మార్పులు చేసింది. గ్రూప్ దశ తర్వాత కొత్తగా సూపర్ 7 స్టేజ్‌ను పరిచయం చేశారు. ఈ టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమై, నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
ICC 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన గ్రూపులను ICC ప్రకటించింది.
గ్రూప్ A:
ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్ A
గ్రూప్ B:
బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, క్వాలిఫయర్ B
2027 వన్డే ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీలో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. తొలుత గ్రూప్ దశలో ఇండియా పాకిస్తాన్ అక్టోబర్ 10న జొహన్నస్ బర్గ్ లో తొలిసారి తలపడనున్నాయి. ఆ తర్వాత సూపర్ సెవెన్‌లో, అనంతరం సెమీఫైనల్ లేదా ఫైనల్లో మరోసారి ఎదురుపడే ఛాన్స్ ఉంది. అలాగే 2027 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియాతో తలపడనుంది. దక్షిణాఫ్రికాలో చివరిసారిగా ప్రపంచకప్ జరిగిన 2003లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లే ఫైనల్లో తలపడ్డాయి. దీంతో 2027 ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా పోరు మరోసారి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..