IND vs NZ: మూడో టీ20కి ముందే టీమిండియాకు భారీ ముప్పు.. హెచ్చరించిన మోర్నే మోర్కెల్..!

న్యూజిలాండ్‌తో మూడో టీ20కి టీమిండియా సిద్ధమవుతున్న వేళ వాతావరణ పరిస్థితులపై బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెల్లింగ్టన్‌లో వీచే బలమైన గాలులు మ్యాచ్‌పై భారీ ప్రభావం చూపొచ్చని చెప్పాడు. గాలి పరిస్థితులను సవాల్‌గా తీసుకుని బౌలర్లు వాటికి తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకోవాలని సూచించాడు.

IND vs NZ: మూడో టీ20కి ముందే టీమిండియాకు భారీ ముప్పు.. హెచ్చరించిన మోర్నే మోర్కెల్..!
Morne Morkel

Updated on: Oct 26, 2026 | 6:21 PM

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ (India) ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత ఇప్పుడు ఇరు జట్లు వెల్లింగ్టన్‌ (Wellington) చేరుకున్నాయి. మూడో టీ20లో న్యూజిలాండ్ (New Zealand) సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలని చూస్తుండగా.. భారత్ మరో విజయం ద్వారా సిరీస్‌పై పట్టు మరింత బిగించాలని భావిస్తోంది.

అయితే మూడో టీ20కి ముందు టీమిండియా (Team India) బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ (Morne Morkel) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా వెల్లింగ్టన్‌లో బలమైన గాలులు ఆటగాళ్లకు కొత్త సవాల్‌గా మారే అవకాశం ఉందని మోర్కెల్ చెప్పాడు.

‘మొత్తం బిల్డింగ్ వణికింది’..

వెల్లింగ్టన్‌లో గాలి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని మోర్కెల్ వివరించాడు. ఉదయం హోటల్‌లో ఉన్న సమయంలో గాలి కారణంగా మొత్తం భవనం వణికినట్లు చెప్పాడు. ఈ పరిస్థితులకు ఆటగాళ్లు త్వరగా అలవాటు పడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

గాలి ప్రభావం బౌలింగ్‌పై మాత్రమే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లపై కూడా పడే అవకాశం ఉంది. అందుకే ప్రాక్టీస్, వార్మప్ సమయంలో గాలి ఎలా ప్రభావం చూపుతుందో ఆటగాళ్లు అర్థం చేసుకోవాలని మోర్కెల్ సూచించాడు.

సాకులు వద్దు.. సవాల్‌గా తీసుకోవాలి..

గాలి పరిస్థితులను ప్రతికూల అంశంగా చూడకుండా సవాల్‌గా స్వీకరించాలని మోర్కెల్ స్పష్టం చేశాడు. మ్యాచ్ సమయంలో పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతి బంతిపై దృష్టి పెట్టి సరైన ఎగ్జిక్యూషన్ ఇవ్వాలని సూచించాడు.

మ్యాచ్‌కు ముందు లభించే తక్కువ ప్రాక్టీస్ సమయమే గాలి దిశ, వేగాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పాడు. మ్యాచ్ మొదలైన తర్వాత మాత్రం పరిస్థితులను పక్కనపెట్టి బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

‘అందరూ గాలికి అనుకూలంగా బౌలింగ్ చేయలేరు’..

వెల్లింగ్టన్‌లో గాలి దిశను బట్టి బౌలింగ్ వ్యూహం కూడా మారాల్సి ఉంటుందని మోర్కెల్ చెప్పాడు. ముఖ్యంగా బలమైన గాలికి ఎదురుగా బంతులు వేయగల బౌలర్ జట్టులో ఉండటం చాలా కీలకమని తెలిపాడు.

“నలుగురు బౌలర్లు గాలికి అనుకూలంగా బౌలింగ్ చేస్తే సరిపోదు. ఎవరో ఒకరు గాలికి ఎదురుగా బౌలింగ్ చేసే బాధ్యత తీసుకోవాలి” అన్నట్టుగా మోర్కెల్ తన వ్యూహాన్ని వివరించాడు.

టెస్టు మ్యాచ్‌కు కూడా ఉపయోగం..

వెల్లింగ్టన్ పరిస్థితులను టీ20 మ్యాచ్ కోణంలోనే కాకుండా టెస్టు మ్యాచ్ దృష్టిలో కూడా టీమిండియా ఉపయోగించుకోవచ్చని మోర్కెల్ తెలిపాడు. ఈ పర్యటనకు ముందే వెల్లింగ్టన్‌లోని పరిస్థితుల గురించి జట్టులో చర్చ జరిగిందని చెప్పాడు.

తాను దక్షిణాఫ్రికా (South Africa) తరఫున న్యూజిలాండ్‌లో పర్యటించిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రత్యేక పద్ధతులు పాటించినట్లు మోర్కెల్ గుర్తు చేసుకున్నాడు. రెండు, మూడు రోజుల్లో ఇలాంటి గాలులకు పూర్తిగా అలవాటు పడటం సాధ్యం కాదని.. ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉండటం ముఖ్యమని చెప్పాడు.

భారత్ 2-0 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో మూడో టీ20లో న్యూజిలాండ్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే వెల్లింగ్టన్ గాలి పరిస్థితులు మ్యాచ్‌ను మరో రకమైన పరీక్షగా మార్చే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us