డోపింగ్ టెస్టులో అడ్డంగా దొరికిపోయిన పాక్ స్టార్ క్రికెటర్‌! నిషేధం విధించిన ఐసీసీ

పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఐసీసీ డోపింగ్ ఉల్లంఘన కారణంగా మూడు నెలల నిషేధం విధించింది. అతని శరీరంలో కార్బాక్సీ-టీహెచ్‌సీ (Carboxy-THC) కనుగొనబడింది. నేరం అంగీకారం, చికిత్సతో నిషేధం తగ్గినా, అతని గత మ్యాచ్ ఫలితాలు, వ్యక్తిగత గణాంకాలు రద్దయ్యాయి. కౌంటీ ఒప్పందం కూడా కోల్పోవడంతో ఇది అతని కెరీర్‌కు గట్టి ఎదురుదెబ్బ.

డోపింగ్ టెస్టులో అడ్డంగా దొరికిపోయిన పాక్ స్టార్ క్రికెటర్‌! నిషేధం విధించిన ఐసీసీ
Mohammad Nawaz Ban

Updated on: Jul 17, 2026 | 6:52 PM

పాకిస్థాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నవాజ్‌పై ఐసీసీ మూడు నెలల నిషేధం విధించింది. ఐసీసీ డోపింగ్ నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నవాజ్ తన తప్పును అంగీకరించి, మాదకద్రవ్యాల వ్యసన చికిత్సా కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించడంతో అతనికి కొంత ఉపశమనం కూడా లభించింది. ఐసీసీ ప్రకారం.. నవాజ్‌పై విధించిన మూడు నెలల నిషేధం మే 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. అదే రోజు నుంచి అతను స్వచ్ఛందంగా తాత్కాలిక సస్పెన్షన్‌ను ప్రారంభించాడు. ఇప్పటికే రెండున్నర నెలల సస్పెన్షన్ పూర్తవడంతో ప్రస్తుతం ఆ తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఇక ఐసీసీ నిర్దేశించిన చికిత్సా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే, చివరకు అతని అనర్హత కాలం ఒక నెలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 7న శ్రీలంకలోని కొలంబోలో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్ అనంతరం నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నవాజ్ శరీరంలో కార్బాక్సీ-టీహెచ్‌సీ (Carboxy-THC) అనే నిషేధిత పదార్థం ఆనవాళ్లు గుర్తించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ పదార్థాన్ని పోటీకి వెలుపల, క్రీడా ప్రదర్శనను మెరుగుపర్చే ఉద్దేశంతో కాకుండా వినోదం కోసం ఉపయోగించినట్లు నవాజ్ అంగీకరించినట్లు ఐసీసీ తెలిపింది. ఈ ఉల్లంఘన కారణంగా ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు, మే 1 వరకు నవాజ్ ఆడిన అన్ని మ్యాచ్‌ల ఫలితాలను ఐసీసీ చెల్లనివిగా ప్రకటించింది. దీంతో అతని వ్యక్తిగత గణాంకాలు కూడా రద్దయ్యాయి.

డోపింగ్ కేసు ప్రభావం నవాజ్ కెరీర్‌పైనా పడింది. ఇంగ్లాండ్‌లో జరిగే టీ20 బ్లాస్ట్ టోర్నీ కోసం కౌంటీ జట్టు సర్రేతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు. మే 26 నుంచి జూలై 18 వరకు అతను సర్రే తరఫున ఆడాల్సి ఉండగా, సస్పెన్షన్ కారణంగా ఆ అవకాశం కోల్పోయాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున నవాజ్ ఏడు మ్యాచ్‌లు ఆడగా, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు కూడా కీలక ఆటగాడిగా కొనసాగాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌కు వైట్‌బాల్ సిరీస్‌లు లేకపోవడంతో జాతీయ జట్టుపై తక్షణ ప్రభావం లేకపోయినా, ఈ డోపింగ్ వ్యవహారం నవాజ్ కెరీర్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us