Vaibhav Sooryavanshi : ఆ ఒక్క వీక్‌నెస్ కొడితే చాలు.. వైభవ్‎ని ఎలా అవుట్ చేయాలో చెప్పిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

Vaibhav Sooryavanshi : 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను ప్రశంసించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, అతని ఫీల్డింగ్‌లో మెరుగుదల అవసరమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు వైభవ్‌ను ఎలా ఎదుర్కోవాలో ఆసక్తికర వ్యూహాన్ని కూడా వెల్లడించారు.

Vaibhav Sooryavanshi : ఆ ఒక్క వీక్‌నెస్ కొడితే చాలు.. వైభవ్‎ని ఎలా అవుట్ చేయాలో చెప్పిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
Vaibhav Sooryavanshi

Updated on: Jun 28, 2026 | 11:36 AM

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, ఆ తర్వాత ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ లీగ్‌లో అతని మెరుపు బ్యాటింగ్ చూసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, వైభవ్ ఆటపై ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ లాంటి కుర్రాళ్ల వల్లే ఇప్పుడు టీ20 క్రికెట్‌లో సగటు స్కోరు 230 ప్లస్‌కు చేరిందని వాన్ కొనియాడారు. టీ20 క్రికెట్‌ను మరో స్థాయికి ఎలా తీసుకెళ్లాలో ఈ చిన్నవాడు ప్రపంచానికి నేర్పిస్తున్నాడని మెచ్చుకున్నారు.

వైభవ్ బ్యాటింగ్‌ను ఎంతగానో పొగిడిన మైఖేల్ వాన్, అజింక్యా రహానే యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ఈ యువ ప్లేయర్ లోని ఒక చిన్న బలహీనతను ఎత్తిచూపారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ రాణించాలంటే అతని ఫీల్డింగ్ విభాగంలో మరింత ఇంప్రూవ్ కావాలని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‎గా మాత్రమే వాడుకుందని, దీనివల్ల అతనికి ఫీల్డింగ్ చేసే అవకాశం రాలేదని చెప్పారు. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు కాబట్టి, వైభవ్ పూర్తి మ్యాచ్ మైదానంలో ఉండాల్సి వస్తుందని గుర్తుచేశారు.

జూలై 1 నుంచి డర్హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుకు మైఖేల్ వాన్ ఒక అదిరిపోయే ప్లాన్ ఇచ్చారు. టాస్ గెలిస్తే ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని, భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాలని సూచించారు. 15 ఏళ్ల వైభవ్ 20 ఓవర్ల పాటు మైదానంలో ఫీల్డింగ్ చేసి అలసిపోతే, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు త్వరగా అవుట్ చేసే అవకాశం ఉంటుందని వాన్ ఒక వింత వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.

మైఖేల్ వాన్ ఇలాంటి అంచనాలు వేస్తున్నప్పటికీ, వైభవ్‌కు ఫీల్డింగ్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్, భారత్-ఎ సిరీస్‌లలో అతను గంటల తరబడి ఫీల్డింగ్ చేసిన రికార్డు ఉంది. అయితే, ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ బరిలోకి దిగడంతో వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తదుపరి మ్యాచ్‌లలో మేనేజ్‌మెంట్ ఎవరికైనా విశ్రాంతినిచ్చి, వైభవ్‌ను జట్టులోకి తీసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడే అవకాశం వస్తే, టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడు.

 

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us