అప్పుడప్పుడూ మ్యాచ్‌ను గెలిపించే క్రమంలో కొంతమంది బ్యాటర్లు ఆడే ఊరమాస్ ఇన్నింగ్స్‌లు ఎప్పుడూ గుర్తుండిపోతాయి.ఇది కూడా ఆ కోవకు చెందినది. 43వ ఓవర్‌లో బరిలోకి దిగిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్.. ధోని స్టైల్‌లో ఫినిషింగ్ షాట్ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక అతడెవరో కాదు.. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్. ఫ్రాంచైజీ క్రికెట్‌లో పేలవ ప్రదర్శనలు కనబరిచినప్పటికీ.. జేమ్స్ నీషమ్.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కివీస్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు.. విండీస్‌తో 3 వన్డేల సిరీస్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. 1-1తో సిరీస్ సమం కాగా.. డిసైడర్‌గా నిలిచిన మూడో వన్డే ఆదివారం బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగింది. ఇందులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టపోయి 301 పరుగులు చేసింది. కైల్ మేయర్స్(105) సెంచరీతో, కెప్టెన్ నికోలస్ పూరన్(91), షై హాప్(51) అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో.. విండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బోల్ట్ 3 వికెట్లు, శాంట్నార్ 2 వికెట్లు, నీషమ్, ఫెర్గుసన్, సౌథీ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక భారీ టార్గెట్ చేధించడంలో భాగంగా బరిలోకి దిగిన కివీస్ జట్టుకు ఓపెనర్ మార్టిన్ గప్తిల్(57) చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్‌లో కాన్వే(56), లాథమ్(69), మిచిల్(63) అర్ధ సెంచరీలు చేయగా.. చివరికి వచ్చేసరికి కివీస్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. అయితే 43 ఓవర్‌లో బరిలోకి దిగిన నీషమ్.. ధోని స్టైల్‌లో టార్గెట్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 11 బంతుల్లో 34 పరుగులు చేయడమే కాకుండా.. చివరి బంతిని సిక్స్‌గా మలిచి.. న్యూజిలాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. విండీస్ బౌలర్లలో హోల్డర్, కారియా రెండేసి వికెట్లు, జోసెఫ్ 1 వికెట్ పడగొట్టాడు. దీనితో 3 వన్డేల సిరీస్‌ను కివీస్ 2-1తో సొంతం చేసుకుంది.