IND vs ENG: బజ్‌బాల్‌ కాదు.. అహంకారం! ఏంటి బ్రో.. ఇంగ్లాండ్‌ను అంత మాట అనేశావ్‌..

లార్డ్స్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లు సమంగా ముగిశాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. సిరాజ్, నితీష్ రెడ్డి, ఆకాశ్ దీప్ వికెట్లు తీసుకున్నారు. హ్యారీ బ్రూక్ ఆక్రమణాత్మక బ్యాటింగ్‌తో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

IND vs ENG: బజ్‌బాల్‌ కాదు.. అహంకారం! ఏంటి బ్రో.. ఇంగ్లాండ్‌ను అంత మాట అనేశావ్‌..
Harry Brook And Akash Deep

Updated on: Jul 13, 2025 | 6:36 PM

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య లార్డ్స్‌ వేదికగా మూడో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లు ఇరు జట్లు కూడా 387 పరుగులే చేయడంతో.. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఏ జట్టు ఎక్కువ రన్స్‌ చేస్తే వారితే విజయం. సరదాగా దీన్ని సింగిల్‌ ఇన్నింగ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. తొలి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు లీడ్‌ రాలేదు. రెండు టీమ్స్‌ కూడా సమవుజ్జీలుగా నిలిచాయి. అయితే.. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌పై లంచ్‌ టైమ్‌ వరకు భారత బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. సిరాజ్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు తీసుకోగా.. ఆ తర్వాత నితీష్‌ కుమార్‌ రెడ్డి, ఆకాశ్‌ దీప్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. 87 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ 4వ వికెట్‌ కోల్పోయిది.

అయితే ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ అవుట్‌ అయిన సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగార్కర, ఇంగ్లాండ్‌ను ఒక రేంజ్‌లో ఏకిపారేశాడు. అసలు ఇది బజ్‌బాల్‌ కాదు.. పూర్తిగా అహంకారం అంటూ మండిపడ్డాడు. అయితే ఆయన కోపానికి కారణం ఉంది. ఒక వైపు వికెట్లు పడుతున్నా హ్యారీ బ్రూక్‌ మాత్రం భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో అప్పటికే 15 పరుగులు కొట్టేశాడు. మొత్తంగా 19 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులు చేసి.. బజ్‌బాల్‌ స్ట్రాటజీని ప్రయోగించాడు. కానీ, ఆ తర్వాత ఆకాశ్‌ దీప్‌ వికెట్‌ లైన్‌లో వేసిన బాల్‌ను స్వీప్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేసి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో సంగార్కర ఇది బజ్‌బాల్‌ కాదు అహంకారం. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో 15 రన్స్‌ చేసిన తర్వాత ఇలాంటి పిచ్చి షాట్‌ ఆడతాడా? అంటూ హ్యారీ బ్రూక్‌ తో పాటు ఇంగ్లాండ్‌ను దారుణంగా ట్రోల్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్‌, టీమిండియా తొలి ఇన్నింగ్సుల్లో 387 పరుగులు చేశాయి. ఇక రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌ లంచ్‌ తర్వాత 4 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. క్రీజ్‌లో సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఉన్నారు. జాక్‌ క్రాలే 22, బెన్‌ డకెట్‌ 12, ఓలీ పోప్‌ 4, హ్యారీ బ్రూక్‌ 23 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 2, నితీష్‌ కుమార్‌ రెడ్డి, ఆకాశ్‌ దీప్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి