వాళ్ల మొహం, వాళ్లను ఆల్ రౌండర్లంటే సిగ్గుపడాల్సిందే.. గంభీర్‌ను ఏకిపారేసిన మాజీ ప్లేయర్..!

Kris Srikkanth Comments on Gautam Gambhir Coaching Strategy: భారత్ జట్టు 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలక చర్చకు తెరలేపేలా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హర్షిత్ రాణా, శివమ్ దూబేలను అసలైన ఆల్‌రౌండర్లుగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ, హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయం ఇంకా దొరకలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

వాళ్ల మొహం, వాళ్లను ఆల్ రౌండర్లంటే సిగ్గుపడాల్సిందే.. గంభీర్‌ను ఏకిపారేసిన మాజీ ప్లేయర్..!
Kris Srikkanth Comments On Gautam Gambhir

Updated on: Jul 25, 2026 | 4:14 PM

Kris Srikkanth Comments on Gautam Gambhir Coaching Strategy: 2027 వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ టీమిండియాలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ స్థానంపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా ఒక్కడే నిజమైన ఆల్ రౌండర్ అని, శివమ్ దూబే, హర్షిత్ రాణాలను ఆల్ రౌండర్లు అని పిలిస్తే తానూ గొప్ప ఆల్ రౌండర్‌నే అవుతానంటూ ఘాటుగా స్పందించడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఆల్ రౌండర్ల అన్వేషణ: హార్దిక్ గాయాలు.. టీమిండియా ఆందోళన..

2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగడం ఖాయమే అయినా, జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య హార్దిక్ పాండ్యా గాయాలు. మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన హార్దిక్ తరచూ గాయాల బారిన పడుతుండటంతో, అతని స్థానాన్ని భర్తీ చేసే ప్రత్యామ్నాయ పేస్ ఆల్ రౌండర్ కోసం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మేనేజ్‌మెంట్ తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే శివమ్ దూబే, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలను రకరకాల సిరీస్‌లలో పరీక్షించారు.

అయితే, ఇప్పటివరకు ఈ ప్రయోగాలు పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వలేకపోయాయి. వన్డేల్లో ఇప్పటివరకు 94 మ్యాచ్‌లు ఆడి 1,904 పరుగులు చేయడంతో పాటు 91 వికెట్లు పడగొట్టిన హార్దిక్ పాండ్యా చూపిన ప్రాభవం, కొత్తగా వచ్చిన వారిలో కనిపించడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.

‘వాళ్లు ఆల్ రౌండర్లు కానే కాదు’.. శ్రీకాంత్ ఓపెన్ టాక్..!

స్టార్ స్పోర్ట్స్ వేదికగా మాట్లాడిన కృష్ణమాచారి శ్రీకాంత్, ప్రస్తుత జట్టులో ఆల్ రౌండర్ల టాగ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. “శివమ్ దూబే, హర్షిత్ రాణాలను ఏమాత్రం ఆల్ రౌండర్లు అని పిలవలేం. ఒకవేళ వాళ్లను ఆల్ రౌండర్లు అంటే, నేను కూడా నన్ను గొప్ప ఆల్ రౌండర్‌గా చెప్పుకోవాలి. జట్టులో హార్దిక్ పాండ్యా ఒక్కడే నిజమైన ఆల్ రౌండర్. నితీష్ కుమార్ రెడ్డిని కొంతవరకు ‘హాఫ్ ఆల్ రౌండర్’ అనుకోవచ్చు. అతను 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ నాలుగైదు ఓవర్లు బౌలింగ్ చేయగలడు” అని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హార్దిక్, హర్షిత్, నితీష్ అందుబాటులో లేకపోవడంతో శివమ్ దూబేను ప్రధాన పేస్ ఆల్ రౌండర్‌గా ఆడించారు. కానీ అతను బంతితో 2 వికెట్లు తీసినప్పటికీ, బ్యాటింగ్‌లో సున్నా పరుగులకే నిరాశపరిచాడు. పైగా ఇంకో పేస్ ఆప్షన్ కోసం దూబేను ఆడించాల్సి రావడంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టాల్సి వచ్చింది. గౌతమ్ గంభీర్ ఆల్ రౌండర్ల సిద్ధాంతం కారణంగా జట్టు కలయిక దెబ్బతింటోందనే విమర్శలకు ఇది మరింత బలమిచ్చింది.

లెక్కలు ఏం చెబుతున్నాయి? నితీష్ కుమార్ రెడ్డికి లక్కీ ఛాన్స్?

గణాంకాలను పరిశీలిస్తే శ్రీకాంత్ చేసిన విశ్లేషణ వాస్తవానికి చాలా దగ్గరగా కనిపిస్తోంది. హర్షిత్ రాణా బౌలర్‌గా సత్తా చాటుతున్నప్పటికీ (14 ఇన్నింగ్స్‌లలో 26 వికెట్లు, 124 రన్స్), బ్యాటింగ్‌లో మెరుపులు ఇంకా నమోదు కాలేదు. అటు శివమ్ దూబే వన్డేల్లో 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 43 రన్స్, 3 వికెట్లతో అంతగా ప్రభావం చూపలేకపోయాడు.

ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వైపే అందరి చూపు నిలుస్తోంది. లిస్ట్-ఎ క్రికెట్‌లో 25 ఇన్నింగ్స్‌లలో 679 రన్స్ చేయడమే కాకుండా 23 వికెట్లు తీసిన నితీష్, హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదిగే సత్తా ఉన్న ఆటగాడిగా కనిపిస్తున్నాడు.

ప్రపంచకప్ సమయానికి హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, అతనికి సరైన బ్యాకప్‌ను సిద్ధం చేసుకోవడం కూడా టీమిండియాకు అంతే కీలకం. మరి కృష్ణమాచారి శ్రీకాంత్ హెచ్చరికల నేపథ్యంలో గంభీర్ తన ప్రయోగాలను కొనసాగిస్తారా లేదా నితీష్ లాంటి వర్ధమాన ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తారా అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us