KL Rahul: కేఎల్ రాహుల్ ‘స్పెషల్ సెంచరీ’.. 10 ఏళ్ల శ్రమకు గౌహతీ వన్డేలో అరుదైన మైలురాయి

KL Rahul: భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గువాహటిలో వెస్టిండీస్‌‌తో జరుగుతున్న రెండో వన్డేతో తన కెరీర్‌లో 100వ వన్డే మైలురాయిని చేరుకున్నారు. 2016లో అరంగేట్రం చేసిన రాహుల్ పదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లోనే జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.

KL Rahul: కేఎల్ రాహుల్ స్పెషల్ సెంచరీ.. 10 ఏళ్ల శ్రమకు గౌహతీ వన్డేలో అరుదైన మైలురాయి
Kl Rahul

Updated on: Sep 30, 2026 | 2:39 PM

KL Rahul: భారత సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ రాహుల్ కెరీర్‌లో 100వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. జూన్ 2016లో జింబాబ్వేపై హరారే వేదికగా వన్డే అరంగేట్రం చేసిన రాహుల్, దాదాపు పదేళ్ల ప్రయాణం తర్వాత ఈ స్పెషల్ సెంచరీని అందుకున్నారు. ప్రస్తుతం 34 ఏళ్ల రాహుల్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో 49.44 సగటుతో 3412 పరుగులు సాధించారు. ఇందులో 8 సెంచరీలు, 20 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఆయన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 112 (నాటౌట్).

మరో 35 పరుగులు చేస్తే 10,000 పరుగులు

ఈ ప్రత్యేకమైన 100వ వన్డే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మరో అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి ఆయనకు మరో 35 పరుగులు మాత్రమే కావాలి. ఇప్పటివరకు 241 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన రాహుల్ 40.50 సగటుతో 9965 పరుగులు సాధించారు. టెస్టు క్రికెట్‌లో 70 మ్యాచ్‌ల్లో 4288 పరుగులు చేసి వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న రాహుల్, టీ20లలో 72 మ్యాచ్‌ల్లో 2265 పరుగులు నమోదు చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు భారత్‌కు వైస్ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్నారు.

గౌహతి వన్డేలో ఆకిబ్ నబీ డెబ్యూ

గువాహటిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. తుది జట్టులో ఒక కీలక మార్పు చేశారు. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకున్నారు. ఇది ఆకిబ్ నబీకి మొదటి అంతర్జాతీయ మ్యాచ్. పరివేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ తర్వాత భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మూ కాశ్మీర్ మూడో క్రికెటర్‌గా ఆకిబ్ నబీ రికార్డు సృష్టించారు.

గౌహతి మైదానంలో పిచ్ పరిస్థితి

టాస్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మైదానంలో పిచ్‌పై కొద్దిగా గడ్డి ఉందని, మ్యాచ్ ప్రారంభంలో పేస్ బౌలర్లకు పిచ్ అనుకూలించే అవకాశం ఉందని చెప్పారు. అందుకే మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సులువుగా చేజిక్కించుకుంటుంది.

రెండో వన్డేకు భారత తుది జట్టు

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us