AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : ఇండియాకు దొరికిన మరో సచిన్.. వైభవ్ పై మాజీ వికెట్ కీపర్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌పై మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ప్రశంసలు కురిపిస్తూ అతడిని సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌ల్లో వైభవ్ ఏకంగా 579 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు.

Vaibhav Suryavanshi : ఇండియాకు దొరికిన మరో సచిన్.. వైభవ్ పై  మాజీ వికెట్ కీపర్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: May 22, 2026 | 11:14 AM

Share

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో తన పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో ప్రపంచ స్థాయి బౌలర్లను వణకిస్తున్న ఈ కుర్రాడిని టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ఆకాశానికెత్తేశారు. వైభవ్‌ను చిన్నప్పటి సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతూ అతను భవిష్యత్తులో దేశానికి ఎనలేని కీర్తిని తీసుకురాబోతున్నాడని భారీ అంచనాలు వేశారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్‌కు ఇంత దగ్గరగా వచ్చిందంటే దానికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో వైభవ్ ఏకంగా 579 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే.. అతని బ్యాటింగ్ సగటు 44.54 గా ఉంటే, స్ట్రైక్ రేట్ మాత్రం నమ్మశక్యం కాని రీతిలో 236.32 గా ఉంది. ఈ సీజన్‌లో అతను ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు బాదాడు.

న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో కిరణ్ మోరే మాట్లాడుతూ.. “నేను మొదటిసారి సచిన్ టెండూల్కర్‌ను చూసినప్పుడు, అతను అంత పెద్ద అంతర్జాతీయ బౌలర్లను ఎలా ఎదుర్కొన్నాడో నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడే నాకు అర్థమైంది సచిన్ చాలా స్పెషల్ అని. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే నాకు మళ్లీ అదే ఫీలింగ్ కలుగుతోంది. అతను చాలా ప్రత్యేకమైన ఆటగాడు. దేవుడే అతడిని క్రికెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసి పంపినట్లున్నాడు. అతడిని తన సహజ సిద్ధమైన శైలిలోనే ఆడనివ్వండి.. దేశానికి గొప్ప పేరు తెస్తాడు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ ఐపీఎల్ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 53 సిక్సర్లు కొట్టి.. ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా ఓవరాల్ టి20 కెరీర్‌లో 31 మ్యాచ్‌లలో 42.66 సగటుతో 1280 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లీస్ట్-ఏ క్రికెట్‌లో కూడా 8 ఇన్నింగ్స్‌ల్లోనే ఒక సెంచరీ సాయంతో 333 పరుగులు చేశాడు.

ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 7 మ్యాచ్‌లలో 62.71 సగటు, 169.49 స్ట్రైక్ రేట్‌తో 439 పరుగులు చేసి టోర్నమెంట్‌లో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో అతను 30 సిక్సర్లు కొట్టి, 2022లో డెవాల్డ్ బ్రెవిస్ నెలకొల్పిన 18 సిక్సర్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. అండర్-19 వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు (1412 రన్స్) చేసిన ఘనత కూడా అతనిదే. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే శ్రీలంకతో జరగబోయే ట్రై-సిరీస్ కోసం అతడిని ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేశారు. అయితే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ సీనియర్ జట్టులో ముందు వరుసలో ఉన్నాడని, వైభవ్‌కు కూడా త్వరలోనే మంచి అవకాశాలు వస్తాయని హింట్ ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us