
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజాలను చిన్న వయసులోనే గుర్తించి ప్రోత్సహించిన ఘనత మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విన్నర్ కపిల్ దేవ్‌కు ఉంది. 1989లో కేవలం 16 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు, అతడిని జట్టులో చేరదీసి అండగా నిలిచింది కపిలే. ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, మరో వండర్ కిడ్లో కపిల్ దేవ్‌కు అలాంటి అరుదైన ప్రతిభే కనిపిస్తోంది. బిహార్‌కు చెందిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ స్థాయి టాలెంట్ ఉందని కపిల్ దేవ్ కొనియాడారు. అతడిని కేవలం వయసు ఆధారంగా కాకుండా, అతడికి ఉన్న అద్భుతమైన సామర్థ్యాన్ని బట్టి అంచనా వేయాలని స్పష్టం చేశారు.
నాడు సచిన్ టెండూల్కర్.. నేడు వైభవ్ సూర్యవంశీ
ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కపిల్ దేవ్, నాడు సచిన్ అరంగేట్రం నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. “సచిన్ అంత చిన్న వయసులో జట్టులోకి వస్తున్నప్పుడు, అంత త్వరగా అతడిని ఆడించడం కరెక్టేనా అని మేమంతా ఆలోచించాం. కానీ చరిత్రను చూస్తే, కొన్నిసార్లు ప్రతిభ ఉన్నవారికి అవకాశం ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదని అర్థమవుతుంది. వైభవ్ విషయంలోనూ అదే వర్తిస్తుంది. అతడు ఆడగలడని నమ్మకం ఉంటే, వయసుతో సంబంధం లేకుండా జట్టులోకి తీసుకోవాలి” అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపికైన భారత టీ20 జట్టులో వైభవ్ భాగమైనప్పటికీ, అతడికి ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.
ఒక శాతం మందిలోనే ఇలాంటి అరుదైన టాలెంట్
వైభవ్ సూర్యవంశీ కేవలం టీ20 ఫార్మాట్‌కు మాత్రమే ప్రస్తుతానికి సరిగ్గా సరిపోతాడని, మిగతా ఫార్మాట్లలో అతడు ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని కపిల్ దేవ్ విశ్లేషించారు. “టాలెంట్ పరంగా చూస్తే, టీ20 క్రికెట్‌లో అతడు సచిన్, విరాట్ కోహ్లీల తరహాలోనే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు. అంత చిన్న వయసులోనే అంతటి ప్రభావం చూపించగల ఆటగాళ్లు ప్రపంచంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉంటారు. అతడి బ్యాటింగ్ శైలి నిజంగా అద్భుతం” అంటూ వైభవ్‌పై కపిల్ ప్రశంసలు కురిపించారు.
హైప్ క్రియేట్ చేసి ఒత్తిడి పెంచొద్దు
యువ ఆటగాడిని ఎంతగానో మెచ్చుకున్నప్పటికీ, కపిల్ దేవ్ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. “నేను అతడి ఆటను చాలా ఎక్కువగా చూడలేదు, కొద్దిగా మాత్రమే చూశాను. అతడిలో అపారమైన ప్రతిభ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడే అతడి గురించి చాలా పెద్దగా మాట్లాడటం, విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. అతడికి కొంత సమయం ఇవ్వాలి. అనవసరమైన అంచనాలు పెంచి, కెరీర్ ప్రారంభంలోనే అతడిపై ఒత్తిడి తీసుకురావద్దు” అని మీడియాకు, అభిమానులకు కపిల్ సూచించారు. యువ ఆటగాళ్లు సహజంగా ఎదిగేందుకు కొంత స్పేస్ అవసరమని పేర్కొన్నారు.
వాళ్లంతా బ్యాడ్ ప్యాచ్‌ను దాటినవారే అన్న కపిల్
క్రికెట్‌లో ప్రతి ఒక్క ఆటగాడికి ఒక గడ్డు కాలం వస్తుందని, వైభవ్‌కు కూడా భవిష్యత్తులో అలాంటి రోజులు వస్తాయని కపిల్ గుర్తుచేశారు. “కష్ట సమయాలు వచ్చినప్పుడు అతడు దాని నుంచి ఎలా బయటపడతాడు అనేదే అసలైన పరీక్ష. ఫుట్‌బాల్ లేదా క్రికెట్ ఏదైనా సరే.. కెరీర్‌లో ఎప్పుడూ ఫామ్ కోల్పోకుండా ఆడిన వారు చాలా అరుదుగా ఉంటారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు కూడా తమ కెరీర్‌లో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నవారే. కాబట్టి వైభవ్ కూడా సహజంగా ఎదిగేలా మనం ప్రోత్సహించాలి” అని కపిల్ దేవ్ ముగించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి