
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఎలైట్ 2026 సీజన్లో సంచలనం నమోదైంది. రైల్వేస్ ఫాస్ట్ బౌలర్ జంషెడ్ ఆలం వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. నవంబర్ 22న ఇండోర్‌లోని డాలీ కాలేజ్ గ్రౌండ్లో సౌరాష్ట్రతో జరిగిన కీలక మ్యాచ్‌లో అతడు 5/38 గణాంకాలతో చెలరేగాడు.
రైల్వేస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ వేసేందుకు జంషెడ్ వచ్చాడు. ఆ ఓవర్లోనే మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పాడు. తొలుత హర్విక్ దేశాయ్‌ను ఔట్ చేసిన 23 ఏళ్ల పేసర్.. ఆ తర్వాత వరుస బంతుల్లో ప్రేరక్ మాంకడ్, రుచిత్ అహిర్, సమ్మర్ గజ్జర్‌లను పెవిలియన్‌కు పంపి డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
SMAT చరిత్రలో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా జంషెడ్ ఆలం నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత అభిమన్యు మిథున్, దర్శన్ నల్కండే మాత్రమే సాధించారు.
కర్ణాటక పేసర్ మిథున్ 2019 SMAT సెమీ-ఫైనల్లో హర్యానాపై సూరత్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హిమాన్షు రాణా, రాహుల్ తెవాటియా, సుమిత్ కుమార్, అమిత్ మిశ్రాలను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. అదే ఓవర్లో జయంత్ యాదవ్‌ను కూడా ఔట్ చేసి 6 బంతుల్లో 5 వికెట్లు తీసి అద్భుతం చేశాడు.
ఆ తర్వాత 2021 SMAT సెమీ-ఫైనల్లో కర్ణాటక-విదర్భ మ్యాచ్‌లో దర్శన్ నల్కండే 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. అది కూడా చివరి ఓవర్లోనే జరగడం విశేషం. అనిరుద్ధ జోషి, బీఆర్ శరత్, జగదీశ సుచిత్, అభినవ్ మనోహర్ అతడి బాధితులు.
ఇప్పుడు ఆ జాబితాలో జంషెడ్ ఆలం చేరాడు. పైగా ఇన్నింగ్స్ ఆరంభంలోనే, నాలుగో ఓవర్లోనే ఈ ఫీట్ సాధించడం అతడి ప్రత్యేకత.
మరోవైపు సౌరాష్ట్ర తరఫున యువ ఆల్‌రౌండర్ మోహిత్ ఉల్వా పోరాడాడు. U19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్తాన్‌పై అదరగొట్టిన తర్వాత అతడు వెంటనే సౌరాష్ట్ర జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ జట్టును పరువు నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
హర్వాన్ష్ పంగాలియా 61 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం చేశాడు. మోహిత్ ఉల్వా 15 బంతుల్లో 22 పరుగులు చేయగా, క్రెయిన్స్ ఫులెత్రా 23 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బంతితో కూడా ఉల్వా 4 ఓవర్లలో 2/38 గణాంకాలు నమోదు చేశాడు.
అయినప్పటికీ జంషెడ్ ఆలం ధాటికి సౌరాష్ట్ర 153/8 స్కోర్‌కే పరిమితమైంది. దీంతో రైల్వేస్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో డబుల్ హ్యాట్రిక్ హీరో జంషెడ్ ఆలం పేరు SMAT రికార్డు పుస్తకాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.