
యశస్వి జైస్వాల్ తన దేశీయ క్రికెట్ భవిష్యత్తు గురించి తీసుకున్న తాజా నిర్ణయం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీసింది. ఇటీవల గోవా తరఫున ఆడేందుకు మొగ్గుచూపిన 23 ఏళ్ల ఈ ప్రతిభావంతుడైన యువ ఆటగాడు, ఇప్పుడు మళ్లీ ముంబైకి మళ్లాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి గోవాకు మారేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోరిన జైస్వాల్, తాజాగా తన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. గోవా నుంచి కెప్టెన్సీ ఆఫర్ వచ్చినప్పటికీ, తన కుటుంబ ప్రణాళికల్లో మార్పు కారణంగా ముంబై తరఫున ఆడటం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. MCAకి పంపిన ఇమెయిల్‌లో “గోవాకు మారాలనే నా ప్రణాళికలు నిలిచిపోయినందున నాకు ఇచ్చిన NOCని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. ఈ సీజన్‌లో ముంబై తరఫున ఆడటానికి నన్ను అనుమతించండి” అని పేర్కొన్నాడు. బీసీసీఐ లేదా గోవా క్రికెట్ అసోసియేషన్‌కు తాను ఎలాంటి అధికారిక పత్రాలు సమర్పించలేదని కూడా స్పష్టం చేశాడు.
తన టెస్ట్ కెరీర్‌ను అత్యంత శుభంగా ప్రారంభించిన యశస్వి, గోవా తరఫున నాయకత్వ భాద్యతలు తీసుకోవాలనే ఆలోచనలో ఉండటం వాస్తవమే కానీ, అతని ప్రధాన దృష్టి భారత జాతీయ జట్టులో స్థిరంగా నిలవడంపైనే ఉంది. దేశవాళీ టోర్నీల్లో గోవా జట్టును ముందుకు నడిపించాలన్న ఆలోచన అతనిలో ఉన్నా, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లా సూర్యవాన్ గ్రామానికి చెందిన యశస్వి, తన చిన్ననాటి క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి కేవలం 11 ఏళ్ల వయసులో ముంబైకి తరలివచ్చాడు. ఆతరువాత విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ కొట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఈ ప్రదర్శన అతనికి IPLలో రాజస్థాన్ రాయల్స్ ఒప్పందాన్ని, అనంతరం భారత జాతీయ జట్టులో చోటును తెచ్చిపెట్టింది.
ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో యశస్వి 19 మ్యాచ్‌లు ఆడి 52.88 సగటుతో 1,798 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, పది అర్ధసెంచరీలు ఉన్నాయి. టాలెంట్‌తో పాటు స్థిరతను కూడబెట్టిన యశస్వి, దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున కొనసాగాలని నిర్ణయించడం అతని క్రికెట్ ప్రస్థానంలో మరో కీలక మలుపుగా చెప్పవచ్చు.
Yashasvi Jaiswal has decided to stay with Mumbai for domestic cricket, reversing his earlier request for a No Objection Certificate (NOC) from the Mumbai Cricket Association to move to Goa.#YashasviJaiswal #MCA #RanjiTrophy pic.twitter.com/XvhzpECjge
— OneCricket (@OneCricketApp) May 9, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..