
India vs New Zealand 4th T20I: న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు కీలక పరిణామం చోటుచేసుకుంది. గజ్జల్లో గాయం కారణంగా గత మ్యాచ్‌లకు దూరమైన ఇషాన్ కిషన్ (Ishan Kishan) వెల్లింగ్టన్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. భారత్ (India), న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరుగుతున్న సమయంలో వెల్లింగ్టన్ స్టేడియంలోని ఇండోర్ నెట్స్‌లో ఇషాన్ బ్యాటింగ్‌కు దిగినట్లు స్పోర్ట్స్ నౌ జర్నలిస్ట్ అంకర్ కర్ తెలిపారు.
అయితే ఇషాన్ ఎంతసేపు బ్యాటింగ్ చేశాడు? సెషన్ తీవ్రత ఎంత ఉంది? అనే వివరాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఇషాన్ కుడి అడక్టర్ స్ట్రెయిన్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ తిరిగి బ్యాటింగ్ చేయడం భారత జట్టు అభిమానులకు ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ ఏడాది 35 టీ20 మ్యాచ్‌ల్లో ఇషాన్ 1159 పరుగులు సాధించాడు. 36.21 సగటుతో పాటు దాదాపు 180 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇందులో ఒక శతకం, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగుల రికార్డుపై కూడా ఇషాన్ కన్నేశాడు. ఈ జాబితాలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రియా ఆటగాడు కరణ్‌బీర్ సింగ్ (Karanbir Singh) 2025లో 32 ఇన్నింగ్స్‌ల్లో 1488 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
2026లో ఇంకా ఐదు టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉండగా, భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) రికార్డుకు ఇషాన్ కేవలం ఐదు పరుగుల దూరంలో ఉన్నాడు.
ఇషాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని నాలుగో టీ20కి అందుబాటులోకి వస్తే తుది జట్టు ఎంపిక భారత టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కారణం.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మూడో టీ20లో తన సత్తా చాటడమే.
వెల్లింగ్టన్లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. అంతకుముందు అతడిని మూడో టీ20లో ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఏకంగా 137 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
అభిషేక్, వైభవ్ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్ ఇన్నింగ్స్ కారణంగా సంజూ శాంసన్ (Sanju Samson)కు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు.
ఇషాన్ కిషన్ నాలుగో టీ20కి ఫిట్‌గా అందుబాటులోకి వస్తే.. వైభవ్‌ను కొనసాగించాలా, లేక ఇషాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలా అనే నిర్ణయం కీలకం కానుంది. వైభవ్‌కు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తే, ఇతర బ్యాటర్లలో మార్పు చేయాల్సి రావచ్చు.
మరోవైపు ఇషాన్ భారత టీ20 జట్టులో కీలక ఆటగాడు కావడంతో అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటే తుది జట్టులోకి రావడం సహజమే. అలాంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మకు విశ్రాంతి ఇచ్చి వైభవ్‌ను కొనసాగించే అవకాశం కూడా చర్చలోకి రావచ్చు.
మూడో టీ20లో అభిషేక్ శర్మ 38 బంతుల్లో 113 పరుగులతో విధ్వంసం సృష్టించగా, వైభవ్ 19 బంతుల్లో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో నాలుగో టీ20లో తుది జట్టు ఎంపిక ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఇషాన్ ఫిట్‌నెస్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం దొరకనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..