
IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడి పంజాబ్ కింగ్స్‌కు వెళ్లనున్నాడని, అతడి స్థానంలో పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులోకి రానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మార్పు ముంబై ఇండియన్స్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందనే అంశంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. హార్దిక్ వెళ్లిపోవడం కంటే అర్ష్‌దీప్ రావడం వల్ల ముంబైకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విశ్లేషించాడు.
ముంబై బౌలింగ్‌కు కొత్త బలం
ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ కార్యక్రమం ఆకాశవాణిలో మాట్లాడుతూ.. అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులోకి వస్తే బౌలింగ్ విభాగం మరింత బలపడుతుందని చెప్పాడు. ఇప్పటికే జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అర్ష్‌దీప్ కూడా చేరితే భారత టీ20 జట్టులో కీలకంగా ఉన్న ఇద్దరు బౌలర్లు ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడే అవకాశం ఉంటుంది. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలోనూ వీరిద్దరూ ఉపయోగపడతారని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ జోడీ ముంబైకి అదనపు బలంగా మారుతుందని పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా హార్దిక్ అవసరం లేదన్న చోప్రా
హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడం వల్ల ముంబైకి కెప్టెన్సీ విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండదని ఆకాశ్ చోప్రా చెప్పాడు. ఆ జట్టులో ఇప్పటికే కెప్టెన్సీ చేపట్టగల ఆటగాళ్లు ఉన్నారని వివరించాడు. రోహిత్ శర్మకు మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగించవచ్చని, లేదంటే సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఎంపిక అవుతాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే తిలక్ వర్మకు కూడా అవకాశం ఇవ్వొచ్చని చెప్పాడు. అందువల్ల కెప్టెన్‌గా హార్దిక్‌ను కొనసాగించాల్సిన అవసరం ముంబైకి లేదన్నది చోప్రా విశ్లేషణ.
బ్యాటింగ్‌లోనూ హార్దిక్‌కు ప్రత్యామ్నాయం
ఆటగాడిగా కూడా హార్దిక్ గత మూడు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. 2024, 2025, 2026 సీజన్లలో ఒక సీజన్ మినహా మిగతా రెండింటిలో బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడని విశ్లేషించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అతడి బౌలింగ్ ఎకానమీ 10 పరుగులకంటే ఎక్కువగా ఉందని గుర్తుచేశాడు. మరోవైపు నమన ధీర్ వేగంగా ఎదుగుతున్నాడని, హార్దిక్ ఆడే స్థానంలో అతడు కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేయగలడని చెప్పాడు. నమన ధీర్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తే హార్దిక్ లేని లోటును కొంతవరకు భర్తీ చేయగలడని చోప్రా అభిప్రాయపడ్డాడు.
పంజాబ్‌కు ఆల్‌రౌండర్ల సమస్య
ఈ ట్రేడ్‌తో ముంబై ఇండియన్స్‌కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, పంజాబ్ కింగ్స్‌కు మాత్రం ఆటగాళ్ల కూర్పు విషయంలో కొత్త సవాళ్లు ఎదురుకావచ్చని ఆకాశ్ చోప్రా చెప్పాడు. పంజాబ్ జట్టులో ఇప్పటికే ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉన్నారని, హార్దిక్ చేరితే ఆ విభాగంలో మరింత పోటీ పెరుగుతుందని విశ్లేషించాడు. అయితే హార్దిక్ బ్యాట్‌తో రాణిస్తే పంజాబ్‌కు ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగలడని కూడా పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో అతడు మరింత మెరుగ్గా ఆడే అవకాశం ఉందన్నాడు. మొత్తంగా ఈ డీల్‌లో పంజాబ్ కంటే ముంబైకే ఎక్కువ లాభమని తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..