
IPL 2027: ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఓ ఆసక్తికరమైన పేరు తెరమీదకు వచ్చింది. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ వచ్చే సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. తాజాగా ఆయన అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) డ్రాఫ్ట్‌లో బ్రిటిష్ పౌరుడిగా పేరు నమోదు చేసుకున్నారు. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఈ డ్రాఫ్ట్‌లో అమీర్‌ను యూకే ఆటగాడిగా గుర్తించారు. ఆయన ప్రస్తుతం ఇంగ్లండ్‌లో నివసిస్తున్నారు. బ్రిటిష్ పౌరసత్వం పొందిన నేపథ్యంలో విదేశీ ఆటగాడిగా వివిధ టీ20 లీగ్‌లలో పాల్గొనే అవకాశాలు పెరిగాయి. అయితే ఏపీఎల్ డ్రాఫ్ట్‌లో పేరు నమోదు చేసుకున్నంత మాత్రాన ఐపీఎల్‌లో ఆడటం ఖరారు కాదు.
బ్రిటిష్ పౌరసత్వంతో మారిన పరిస్థితులు
34 ఏళ్ల మొహమ్మద్ అమీర్ 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. పాకిస్థాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఆయన భార్య బ్రిటిష్ పౌరురాలు కావడంతో అమీర్‌కు బ్రిటిష్ పౌరసత్వం లభించింది. దీంతో ఇంగ్లండ్‌లో జరిగే కొన్ని దేశవాళీ టోర్నీల్లో స్థానిక ఆటగాడిగా ఆడే అవకాశం కూడా వచ్చింది. 2026లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున టీ20 బ్లాస్ట్‌లో స్థానిక ఆటగాడిగా బరిలోకి దిగారు. ఐపీఎల్‌లోనూ బ్రిటిష్ పౌరసత్వం ఆధారంగా అవకాశం దక్కుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అజర్ మహమూద్‌కు గతంలో దక్కిన అవకాశం
ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనడంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, గతంలో అజర్ మహమూద్ బ్రిటిష్ పాస్‌పోర్ట్‌తో ఈ లీగ్‌లో ఆడారు. 2012 నుంచి 2015 మధ్య కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. అందుకే అమీర్ విషయంలోనూ ఆయన ఉదాహరణను ప్రస్తావిస్తున్నారు. అయితే ఇద్దరి పరిస్థితులు, వర్తించే నిబంధనలు ఒకేలా ఉంటాయని ముందుగానే చెప్పలేం. అమీర్ ఐపీఎల్ వేలానికి పేరు నమోదు చేస్తారా? ఆయనను ఆటగాడిగా అనుమతిస్తారా? ఏదైనా జట్టు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అఫ్గాన్ లీగ్ డ్రాఫ్ట్‌లో మరికొందరు భారత ఆటగాళ్లు
అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో అమీర్‌తో పాటు పలువురు భారత ఆటగాళ్లు కూడా పేర్లు నమోదు చేసుకున్నారు. మాజీ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్, స్పిన్నర్ మురుగన్ అశ్విన్ ఈ జాబితాలో ఉన్నారు. క్రిక్‌బజ్ సమాచారం ప్రకారం, వీరిని భారత ఆటగాళ్లుగా నమోదు చేశారు. కేఎస్ భరత్‌ను యూఏఈలో నివసిస్తున్న భారత ఆటగాడిగా పేర్కొన్నారు. ఈ డ్రాఫ్ట్ నవంబర్ 3న దుబాయ్‌లో జరగనుంది. లీగ్‌ను ఈ ఏడాది చివర్లో నిర్వహించే అవకాశం ఉంది.
డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 మినీ వేలం?
ఐపీఎల్ 2027 కోసం మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరిగే అవకాశం ఉందని పలు వార్తా కథనాలు వెల్లడించాయి. ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను జట్లకు అందించనున్నారు. అయితే వేలం తేదీ, వేదికపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వేలంలో అమీర్ పేరు ఉంటుందా? ఏదైనా జట్టు ఆయనను కొనుగోలు చేస్తుందా? అన్నది తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..