Vaibhav Suryavanshi : ఎడమ కాలిలోనే ఉంది మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వెనుక ఉన్న సీక్రెట్ ఇదేనట
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ కొట్టే భారీ సిక్సర్ల సీక్రెట్ అతని ఎడమ కాలు మూవ్‌మెంట్‌లో దాగి ఉందని జుబీన్ భరూచా వివరించారు. సాధారణంగా చాలా మంది బ్యాటర్లు షాట్లు కొట్టడానికి ఫుట్‌వర్క్‌పై ఎక్కువగా శ్రమిస్తారు. కానీ వైభవ్ మాత్రం క్రీజులో ఎక్కువ కదలికలు లేకుండా నిలబడిన చోటు నుంచే అద్భుతమైన షాట్లను ఆడగలడు.

Vaibhav Suryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. లెఫ్ట్ హ్యాండ్ కలిగిన ఈ అద్భుతమైన ఆటగాడు ఐపీఎల్‌లో బరిలోకి దిగాడంటే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తున్నాడు. మైదానంలో ఎంతటి దిగ్గజ బౌలర్లు బౌలింగ్ వేస్తున్నా, వారి లైన్ అండ్ లెంగ్త్‌ను పూర్తిగా దెబ్బతీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఈ చిన్నారి ప్లేయర్ ఏకంగా 65 సిక్సర్ల సాయంతో 680 పరుగులు బాదేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ ఎలా ఇంతలా రెచ్చిపోతున్నాడు, అతని పవర్‌ఫుల్ బ్యాటింగ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనే విషయాలను రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జుబీన్ భరూచా తాజాగా వెల్లడించారు.
వైభవ్ సూర్యవంశీ కొట్టే భారీ సిక్సర్ల సీక్రెట్ అతని ఎడమ కాలు (బ్యాక్‌ఫుట్) మూవ్‌మెంట్‌లో దాగి ఉందని జుబీన్ భరూచా వివరించారు. సాధారణంగా చాలా మంది బ్యాటర్లు షాట్లు కొట్టడానికి ఫుట్‌వర్క్‌పై ఎక్కువగా శ్రమిస్తారు. కానీ వైభవ్ మాత్రం క్రీజులో ఎక్కువ కదలికలు లేకుండా నిలబడిన చోటు నుంచే అద్భుతమైన షాట్లను ఆడగలడు. బౌలర్ బంతిని విసిరే క్రమంలో వైభవ్ తన శరీరం బరువు మొత్తాన్ని ఎడమ కాలిపై (బ్యాక్‌ఫుట్) ఉంచుతాడు. అతని చేతులు, కళ్లు, శరీరం అన్నీ ఒకేసారి సింక్ అవుతూ బంతిని ముందే అంచనా వేయడానికి సహాయపడతాయి. క్రీజు లోతును పూర్తిగా వాడుకుంటూ, బ్యాట్‌ను పైకి ఎత్తే విధానం (హై బ్యాక్‌లిఫ్ట్) అతని షాట్లకు అదనపు వేగాన్ని, శక్తిని ఇస్తుందని భరూచా పేర్కొన్నారు.
గత ఏడాది (2025) ఐపీఎల్ సమయంలో వైభవ్ కేవలం లెగ్ సైడ్ మాత్రమే ఎక్కువగా షాట్లు ఆడేవాడని జుబీన్ భరూచా గుర్తు చేశారు. అయితే ప్రత్యర్థి జట్లు అతని బలహీనతను కనిపెట్టక ముందే, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ వైభవ్ చేత ఆఫ్ సైడ్‌లో కూడా అద్భుతమైన షాట్లు ఆడేలా కఠిన శిక్షణ ఇప్పించింది. గత ఒక సంవత్సర కాలంగా అతను తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి పెద్ద మార్పులు చేయనప్పటికీ, ఆఫ్ సైడ్ షాట్ రేంజ్‌ను మాత్రం భారీగా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గత సీజన్‌తో పోలిస్తే ఈసారి వైభవ్‌లో ఆత్మవిశ్వాసం వంద రెట్లు పెరిగిందని, అదే అతన్ని సక్సెస్ బాటలో నడిపిస్తోందని కోచ్ తెలిపారు.
ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన ట్రయల్స్‌లో వైభవ్ పాల్గొన్నప్పుడు, అతని బ్యాట్ స్పీడ్ అంత వేగంగా ఏమీ లేదు. ఈ విషయాన్ని గమనించిన రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ బృందం అతనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దాదాపు మూడు నెలల పాటు వైభవ్ బ్యాట్ స్పీడ్‌ను పెంచడం కోసం ప్రత్యేకమైన ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు. ఈ నిరంతర శ్రమ ఫలితంగా అతని బ్యాట్ స్పీడ్ ఏకంగా 30 శాతం మేర మెరుగైంది. అందుకే ఇప్పుడు వైభవ్ బ్యాట్ నుంచి వచ్చే ప్రతి షాట్ బుల్లెట్‌లా దూసుకెళ్తూ నేరుగా స్టేడియం అవతల పడుతోంది.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఇంత చిన్న వయసులో, ఇంత స్పష్టంగా క్లీన్ షాట్లు ఆడే ఏ ఆటగాడిని తాను చూడలేదని జుబీన్ భరూచా ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ ఆటతీరు వేరుగా ఉన్నప్పటికీ, క్రికెట్‌పై అతనికున్న అవగాహన, ఆలోచనా విధానం మాత్రం సరిగ్గా సచిన్ లాగే ఉంటాయని కొనియాడారు. అయితే ప్రతి ఆటగాడి కెరీర్‌లో లాగే వైభవ్‌కు కూడా భవిష్యత్తులో ఒడిదొడుకులు, ఫెయిల్యూర్స్ వస్తాయని, ఆ సమయంలో విమర్శల శబ్దం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. కానీ వైభవ్ అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచే మరింత వేగంగా క్రికెట్‌ను నేర్చుకుంటాడని, అతను మరిన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కొని గొప్ప ప్లేయర్‌గా ఎదగాలని కోరుకుంటున్నట్లు భరూచా ముగించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
