RR vs GT: రాసిపెట్టుకోండి.. గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఆ 5 ఓవర్లే..!

Rajasthan Royals vs Gujarat Titans: ప్రస్తుత ఫామ్, పిచ్ పరిస్థితులు, ఆటగాళ్ల జోరును బట్టి చూస్తే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు "హాట్ ఫేవరెట్"గా బరిలోకి దిగుతోంది. అయితే గాయపడ్డ సింహంలా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టును తక్కువ అంచనా వేయలేం. మరి ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో, బెంగళూరుతో ఫైనల్ పోరులో తలపడే ఆ రెండో జట్టు ఏదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

RR vs GT: రాసిపెట్టుకోండి.. గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఆ 5 ఓవర్లే..!
Gt Vs Rr Qualifier 2 Match

Updated on: May 29, 2026 | 4:45 PM

Rajasthan Royals vs Gujarat Titans: ఐపీఎల్ తుది పోరుకు సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లగా, ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చుకునేందుకు ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘనవిజయంతో ఊపుమీదున్న రాజస్థాన్‌కు, క్వాలిఫయర్-1 లో ఎదురైన పరాభవాన్ని మర్చిపోయి పుంజుకోవాలని చూస్తున్న గుజరాత్‌కు మధ్య ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ జోరు.. ఎలిమినేటర్ విజయం ఇచ్చిన ఊపు..!

ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన అద్భుత విజయం రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ “డూ ఆర్ డై” (గెలిస్తేనే ముందడుగు) పోరుకు సంజూ శాంసన్ సేన సర్వసన్నద్ధమైంది. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్, ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా ఫైనల్లో ఆర్సీబీతో తలపడాలని పట్టుదలతో ఉంది.

వయసు 15 ఏళ్లే.. కానీ విధ్వంసం ప్రపంచస్థాయి! వైభవ్ సూర్యవంశీ సంచలనం..

రాజస్థాన్ జట్టుకు ఇప్పుడు అతిపెద్ద బలం వారి 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ కుర్రాడు సృష్టించిన శివతాండవం అంతా ఇంతా కాదు. కేవలం 29 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే రాజస్థాన్ భారీ స్కోరు సాధించి, హైదరాబాద్‌ను 40 పరుగుల తేడాతో ఓడించగలిగింది. గుజరాత్ బౌలర్లకు కూడా ఈ కుర్రాడిని అడ్డుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి

ఒత్తిడిలో గుజరాత్ టైటాన్స్.. గిల్ సేన వ్యూహాలు పారుతాయా?

మరోవైపు, లీగ్ దశలో అద్భుతంగా రాణించిన గుజరాత్ టైటాన్స్ జట్టు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో 92 పరుగుల భారీ తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. 255 పరుగుల భారీ లక్ష్య చేధనలో రాహుల్ తెవాటియా (68 పరుగులు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఫైనల్‌కు వెళ్లడానికి లీగ్ టేబుల్ పొజిషన్ వల్ల గుజరాత్‌కు మరో అవకాశం లభించినప్పటికీ, జట్టు ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టు రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపరకు అడ్డుకట్ట వేయాలని సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది.

ముల్లాన్‌పూర్ పిచ్ ఎవరికి అనుకూలం? రాజస్థాన్‌కే అడ్వాంటేజ్!

న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ (ముల్లాన్‌పూర్ స్టేడియం) వేదికగా ఈ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఇక్కడే రాజస్థాన్ రాయల్స్ తమ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి విజయం సాధించడంతో, ఈ పిచ్, అక్కడి వాతావరణ పరిస్థితులపై ప్రత్యర్థి గుజరాత్ కంటే రాజస్థాన్‌కే ఎక్కువ అవగాహన ఉంది. ఈ హోమ్ కండిషన్ లాంటి వాతావరణం రాజస్థాన్‌కు బాగా కలిసివచ్చే అంశం. అటు బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం రాజస్థాన్ బలాన్ని రెట్టింపు చేస్తోంది.

తొలి ఐదు ఓవర్లలోనే మ్యాచ్ భవితవ్యం!

ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఫలితం దాదాపు మొదటి ఐదు ఓవర్లలోనే తేలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ గుజరాత్ బౌలర్లు పవర్‌ప్లేలోనే సంచలన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని త్వరగా అవుట్ చేయగలిగితే గుజరాత్‌కు గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. అలా కాకుండా సూర్యవంశీ మరోసారి పవర్‌ప్లేలో చెలరేగిపోతే మాత్రం ఈ క్వాలిఫయర్ మ్యాచ్ కూడా ఏకపక్షంగా రాజస్థాన్ వశమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us