
IPL 2026 Auction: ఐపీఎల్ (IPL) 2026 సీజన్‌కు సంబంధించిన వేలం (Auction) డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈ మెగా వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, ఇందులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (Josh Inglis) గురించి వచ్చిన ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వేలం కోసం జోష్ ఇంగ్లిస్ తన కనీస ధరను (Base Price) రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు. అయితే, రాబోయే సీజన్‌లో తాను కేవలం 4 మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని అతడు బీసీసీఐ (BCCI)కి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 14 మ్యాచ్‌లు జరిగే లీగ్ దశలో, అతను కనీసం సగం మ్యాచ్‌లు కూడా ఆడలేడు. కేవలం 4 మ్యాచ్‌ల కోసమే రూ. 2 కోట్ల భారీ ధరను నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తరపున అద్భుతంగా రాణించి, జట్టును ఫైనల్ చేర్చడంలో ఇంగ్లిస్ కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ, పంజాబ్ ఫ్రాంచైజీ అతన్ని రిటెన్షన్ సమయంలో రిలీజ్ చేసింది. దీనికి ప్రధాన కారణం అతడి వివాహమేనని తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ సమయంలోనే ఇంగ్లిస్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ కారణంగానే అతను పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండలేనని స్పష్టం చేశాడు.
సాధారణంగా ఫ్రాంచైజీలు సీజన్ మొత్తం అందుబాటులో ఉండే ఆటగాళ్లపైనే ఆసక్తి చూపిస్తాయి. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాడు కేవలం 4 మ్యాచ్‌లకే వస్తానంటే, ఫ్రాంచైజీలు అతనిపై కోట్లు కుమ్మరించే సాహసం చేస్తాయా అనేది అనుమానమే. ఇంగ్లిస్ నిర్ణయంతో అతడు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..