ఐపీఎల్ 2023 మినీ వేలానికి ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. డిసెంబర్ 23వ తేదీ కొచ్చి వేదికగా ఆక్షన్ జరగనుండగా.. ఈలోపే నవంబర్ 15న ఫ్రాంచైజీలు తమ దగ్గర అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని డెడ్‌లైన్ పెట్టింది బీసీసీఐ. ఈ నేపధ్యంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమ తుది జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఫ్రాంచైజీలు పలువురి సీనియర్ ఆటగాళ్లకు ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం. మినీ వేలానికి ముందు వారిని రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ లిస్టులో బడా ప్లేయర్స్ ఉన్నారని తెలుస్తోంది. వారి ఫామ్, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆటతీరు, డొమెస్టిక్ క్రికెట్‌లో ప్రదర్శన.. ఇలా పలు కారణాలను సాకుగా చూపించి వారిని వదులుకోవాలని నిర్ణయించారని ఓ క్రికెట్ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. ఇక ఈ లిస్టులో మయాంక్ అగర్వాల్, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, షారూఖ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్ ఉన్నారు. వీరందరూ కూడా గత ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చూపించారు. అలాగే మెగా ఆక్షన్‌లో ఫ్రాంచైజీలు వీరిపై కోట్ల వర్షం కురిపించారు.
మయాంక్ అగర్వాల్, జాసన్ హోల్డర్, షారూఖ్ ఖాన్ విషయం అటుంచితే.. రవిచంద్రన్ అశ్విన్, నికోలస్ పూరన్, కేన్ విలియమ్సన్‌లు టీ20 వరల్డ్‌కప్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచారు. తన పదునైన బౌలింగ్‌తో అశ్విన్ వికెట్లు తీయకపోగా.. విలియమ్సన్ అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఇక పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించిన వెస్టిండిస్ టీం లీగ్ స్టేజీకి రాకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. వీటిని పరిగణనలోకి తీసుకుని ఫ్రాంచైజీలు వేటు వేసేందుకు సిద్దమయ్యాయి.