IPL 2022: ముంబై, సీఎస్‌కే జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయా.? ఇవిగో లెక్కలు.!

|

Apr 26, 2022 | 7:55 PM

ఐపీఎల్‌లో ఇప్పటివరకు తిరుగులేని జట్లుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకచ్ఛత్రాధిత్యాన్ని కొనసాగించాయి...

IPL 2022: ముంబై, సీఎస్‌కే జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయా.? ఇవిగో లెక్కలు.!
Rohit Sharma & Dhoni
Follow us on

ఐపీఎల్‌లో ఇప్పటివరకు తిరుగులేని జట్లుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకచ్ఛత్రాధిత్యాన్ని కొనసాగించాయి. ముంబై ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవగా.. చెన్నై సూపర్ కింగ్స్(CSK) నాలుగుసార్లు.. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. అయితే ప్రస్తుత సీజన్‌లో మాత్రం ఈ జట్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి. ముంబై ఇండియన్స్ ఆడిన 8 మ్యాచ్‌లలో.. ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా పాయింట్స్ పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండగా.. చెన్నై 4 పాయింట్లతో 9వ స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 8వ స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు జట్ల పరిస్థితి చూస్తుంటే.. ప్లేఆఫ్స్‌కు చేరుతాయా.? అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి అసలు ఏ జట్టు ముందుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది? 6 పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కు చేరుకోగలదా? ముంబై ఇండియన్స్ ఆశలన్నీ అడియాశలేనా? మరి కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి ఏంటి? లాంటి పూర్తి లెక్కలు ఇప్పుడు చూద్దాం..

CSK ఇప్పటికీ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించగలదా?

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై పరాజయం పాలవ్వడంతో ఈ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో అడ్డంకులు మరింత పెరిగాయి. 4 పాయింట్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మొత్తం 6 మ్యాచ్‌లు గెలిస్తే చెన్నై క్వాలిఫై అవుతుంది. అలా కాకుండా ఐదు మ్యాచ్‌లు గెలిచినా, ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. కానీ నెట్ రన్‌రేట్‌ పరిగణనలోకి వస్తుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుకోగలదా?

వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా ముగిశాయి. ప్రస్తుతం ముంబైకి 6 మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ఈ మ్యాచ్‌లన్నింటినీ ఆ జట్టు భారీ తేడాతో గెలవాల్సి ఉంది. దీని తర్వాత ఇతర జట్ల గెలుపు, ఓటములపై ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. అయితే టాప్ 5 జట్లకు 14 పాయింట్లు వస్తే.. ముంబై టోర్నీ నుంచి ఔట్ అయినట్లే.

కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు ఎలా చేరుతుంది.?

పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ 8వ స్థానంలో ఉంది. ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 5 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కోల్‌కతా 6 మ్యాచ్‌ల్లో 5 గెలవాలి. జట్టు 4 మ్యాచ్‌లు గెలిస్తే మాత్రం.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. నెట్ రన్‌రేట్‌ పరిగణలోకి వస్తుంది. కోల్‌కతా.. ఢిల్లీ, లక్నో, చెన్నై, రాజస్థాన్, పంజాబ్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే..

ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. ఈ జట్టు మరో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అంటే.. ఆ ఏడింటిలో 5 విజయాలు సాధిస్తే ఢిల్లీకి 16 పాయింట్లు దక్కుతాయి.. ఈజీగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు. ఢిల్లీ 4 విజయాలతో కూడా అర్హత సాధించగలదు, కానీ నెట్ రన్‌రేట్ పరిగణనలోకి వస్తుంది.

పంజాబ్ 6 మ్యాచ్‌ల్లో 4 గెలవాల్సి ఉంది..

పంజాబ్ కింగ్స్‌కు ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. చెన్నైని ఓడించి 8 పాయింట్లు సాధించింది. ఇప్పుడు ఆ జట్టు లక్నో, గుజరాత్, రాజస్థాన్, బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంది. వీటిల్లో పంజాబ్ మరో 4 మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయం.

బెంగళూరు మరో 3 మ్యాచ్‌లు గెలవాలి..

ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే బెంగళూరు మరో 3 మ్యాచ్‌లు గెలవాలి. ఆ జట్టు మొత్తంగా 6 మ్యాచ్‌లు ఆడాలి. RCB ప్రస్తుతం 10 పాయింట్లతో ఉండగా.. రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్(2), సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది.

లక్నో సూపర్‌జెయింట్స్‌ పరిస్థితి ఏంటి.?

లక్నో సూపర్‌ జెయింట్స్ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే వాటిల్లో 3 విజయాలు సాధిస్తే చాలు.

రాజస్థాన్-హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు ఎలా చేరుకుంటాయి..

రాజస్థాన్, హైదరాబాద్ 5-5తో గెలిచి 10-10 పాయింట్లు సాధించాయి. ఇప్పుడు హైదరాబాద్‌కు 7 మ్యాచ్‌లు మిగిలి ఉండగా ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే 3 మ్యాచ్‌లు గెలవాలి. మరోవైపు రాజస్థాన్ కూడా 7 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే గెలవాల్సి ఉంది. హైదరాబాద్ ఇప్పుడు గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అటు రాజస్థాన్.. బెంగళూరు, ముంబై, కోల్‌కతా, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ, లక్నో, చెన్నై‌లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.