India vs New Zealand: కివీస్ తరపున ఆడుతోన్న మరో భారతీయడు.. సచిన్, ద్రవిడ్‌ల పేర్లను తనలో భాగం చేసుకున్న ఆటగాడేవరో తెలుసా?

|

Nov 18, 2021 | 7:32 PM

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లను తన పేరులో చేర్చుకున్నాడు. ఇప్పటి వరకు 6 టీ20ల్లో కివీస్‌ తరఫున ఆడాడు.

India vs New Zealand: కివీస్ తరపున ఆడుతోన్న మరో భారతీయడు.. సచిన్, ద్రవిడ్‌ల పేర్లను తనలో భాగం చేసుకున్న ఆటగాడేవరో తెలుసా?
Ind Vs Nz Rachin Ravindra
Follow us on

Rachin Ravindra: భారత సంతతికి చెందిన ఆటగాళ్లు న్యూజిలాండ్‌కు ఆడటం సాధ్యమేనా? అంటే సాధ్యమే అనే జవాబు రానుంది. ఇష్ సోధీ, జీతన్ పటేల్, జీత్ రావల్ మొదలైన వారు దేశ క్రికెట్ చరిత్రలో కివీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. జైపూర్‌లో జరిగిన 3-మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20ఐలో న్యూజిలాండ్ భారత్‌తో తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో భారత సంతతికి చెందిన మరొక ఆటగాడు కూడా ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకున్నాడు. ఆ ఆటగాడి పేరు రచిన్ రవీంద్ర.

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన రచిన్ ఎక్కువ సమయం గడపలేకపోయాడు. 8 బంతుల్లో కేవలం 7 పరుగులే చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే, అతను క్రీజులోకి రావడంతో భారత క్రికెట్ అభిమానులు అతని పేరును గూగుల్‌లో వెతకడం మొదలు పెట్టారు. పేరు భారతీయులుగా కనిపిస్తుండడంతో అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

21 ఏళ్ల రచిన్ రవీంద్ర ఆల్ రౌండర్‌గా పేరుగాంచాడు. ఇతని పేరులో ఇద్దరు భారత క్రికెట్ దిగ్గజాల పేర్లు ఉండడం విశేషం. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేరుతో ఆయన పేరును పెట్టుకున్నాడు. రచిన్ రవీంద్ర వెల్లింగ్‌టన్‌లో భారత సంతతికి చెందిన రవి కృష్ణమూర్తి, దీపా కృష్ణమూర్తిలకు జన్మించాడు.

రచిన్ తండ్రి రవి, 1990లలో బెంగుళూరు నుంచి న్యూజిలాండ్‌కి మారారు. హట్ హాక్స్ క్లబ్‌ను స్థాపించాడు. నిజానికి, రవి కూడా క్రికెట్‌ను అభిమానించేవాడు. బెంగళూరులో క్రికెట్‌ ఆడాడు. ఇక రచిన్ రవీంద్ర విషయానికి వస్తే 2016 అండర్-19 ప్రపంచకప్‌తో పాటు 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను కివీస్ తరపున మొత్తం 6 టీ20ఐలు ఆడాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

లార్డ్స్‌లో భారత్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ జట్టులో కూడా ఎంపికయ్యాడు. కానీ ప్లేయింగ్ XIలో లేడు. “నేను గత నాలుగు సంవత్సరాలుగా RDT (అనంతపురం, ఆంధ్రప్రదేశ్)లో శిక్షణ పొందాను. అక్కడే క్రికెట్ ఆడాను” అని తెలిపాడు.

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ కోచ్‌లలో ఒకరైన ఖతీబ్ సయ్యద్ షహబుద్దీన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, “అతను (రచిన్ రవీంద్ర) గత నాలుగు సంవత్సరాలుగా అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌లో శిక్షణ పొందే హట్ హాక్స్ బృందంలో భాగం. అతను ప్రామిసింగ్ క్రికెటర్. యువ క్రికెటర్‌గా, ఎడమచేతి వాటం బ్యాటర్‌, స్పిన్‌ బౌలింగ్‌లోనూ రాణిస్తాడు’ అని పేర్కొన్నాడు.

ఇక నవంబర్ 2016లో తాను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ శైలిని అనుకరించటానికి ప్రయత్నించానని రచిన్ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘నా బ్యాటింగ్‌కు ఆదర్శం సచిన్ టెండూల్కర్. నేను చిన్నప్పటి నుంచి సచిన్‌ను చూస్తూనే పెరిగాను. నా ఆటను కూడా సచిన్‌లానే మలచుకోవాలని కోరుకున్నాున”అని రచిన్ తెలిపాడు.

అతని కెరీర్ విషయానికి వస్తే.. పొట్టి ఫార్మాట్‌లో రచిన్ మొత్తం 27 మ్యాచ్‌లు (జైపూర్ టీ20ఐ మినహా) ఆడాడు. 129 స్ట్రైక్ రేట్‌తో 338 పరుగులు చేశాడు. 40 అత్యుత్తమ స్కోర్‌గా ఉంది. బంతితో రవీంద్ర 21.6 స్ట్రైక్ రేట్‌తో 25 వికెట్లు పడగొట్టాడు.

Also Read: IPL 2022: మెగా వేలంలో డివిలియర్స్, మ్యాక్స్‌వెల్.? ఆర్‌సీబీ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ వీరేనా.!

IND vs NZ: లైవ్ మ్యాచ్‌లోనూ ప్రేయసి కోసం వెతుకుతోన్న భారత బౌలర్.. సహాయం చేసిన ఆయన సోదరి.. వైరలవుతోన్న ఫన్నీ వీడియో..!