IND vs ENG: ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష.. తేడా కొడితే చీటి చిరుగుడే భయ్యో..!

Team India T20 Squad: ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుపై వారి సొంత గడ్డపై ఆడటం ఎప్పుడూ సవాలే. యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్‌లకు ఈ సిరీస్ ఒక అగ్నిపరీక్ష వంటిది. ఇక్కడ ప్రదర్శించే ఆట తీరే వారి అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తును శాసించనుంది.

IND vs ENG: ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..  తేడా కొడితే చీటి చిరుగుడే భయ్యో..!
India Vs England

Updated on: Jul 02, 2026 | 10:15 AM

Team India T20 Squad: టీమిండియా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు కీలక ఆటగాళ్ల భవితవ్యం ప్రమాదంలో పడింది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో గనక వీరు సత్తా చాటకపోతే, జాతీయ జట్టులో వారి స్థానాలు శాశ్వతంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సిరీస్ సదరు ఆటగాళ్లకు చావో రేవో లాంటి పరిస్థితిగా మారింది.

సంజూ శాంసన్: ప్రతిభ ఉంది.. కానీ నిలకడ ఎక్కడ..?

భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ప్రతిభపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి, జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, సంజూ కెరీర్‌లో అతిపెద్ద మైనస్ పాయింట్ అతని నిలకడలేమి.

ఇటీవల ముగిసిన ఐర్లాండ్ సిరీస్‌లో ఇది మరోసారి స్పష్టమైంది. రెండు మ్యాచ్‌లు కలిపి అతను కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో అతనిపై విపరీతమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే బెంచ్ మీద వైభవ్ సూర్యవంశీ లాంటి యువ సంచలనాలు అవకాశం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇక్కడ విఫలమైతే శాంసన్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమే.

తిలక్ వర్మ: వైస్ కెప్టెన్ హోదాకు తగ్గ ప్రదర్శన అవసరం..

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఐపీఎల్‌లో యావరేజ్ ప్రదర్శన చేసినప్పటికీ, యాజమాన్యం అతనిపై నమ్మకంతో టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఐర్లాండ్ పర్యటనలో ఒక అర్ధ సెంచరీతో 74 పరుగులు చేసినప్పటికీ, అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. నేటి ఆధునిక టీ20 క్రికెట్‌లో స్ట్రైక్ రేట్ అనేది అత్యంత కీలకం.

ఇంగ్లండ్ సిరీస్‌లో తిలక్ వర్మ భారీ పరుగులు చేయడంతో పాటు తన బ్యాటింగ్ వేగాన్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ గనక తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడినా, త్వరగా అవుటైనా సెలక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో పోటీ విపరీతంగా ఉండటంతో తిలక్ తన స్థానాన్ని కాపాడుకోవడానికి శ్రమించక తప్పదు.

వాషింగ్టన్ సుందర్: ఆల్‌రౌండర్ హోదాకు అసలైన పరీక్ష..

భారత స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో తన పాత్ర ఏమిటనే ప్రశ్నను ఎదుర్కొంటున్నాడు. అతనికి బ్యాటింగ్‌లో చాలా దిగువన అవకాశం ఇస్తున్నారు, అలాగే బౌలింగ్‌లోనూ పూర్తి కోటా ఓవర్లు లభించడం లేదు. జట్టు మేనేజ్‌మెంట్‌కు అతని సామర్థ్యంపై పూర్తి నమ్మకం లేనప్పుడు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

ఐర్లాండ్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో అవకాశం వచ్చినప్పటికీ 19 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు, బ్యాటింగ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో తర్వాతి మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అతనిపై వేటు పడింది. ఇంగ్లండ్ పర్యటనలో లభించే అవకాశాలను సుందర్ రెండు చేతులా ఒడిసిపట్టుకోవాలి, లేదంటే జట్టులో అతని ప్రస్థానానికి బ్రేక్ పడటం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us