
Handshake Controversy : ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య నెలకొన్న నో హ్యాండ్‌షేక్ వివాదం యావత్ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత క్రికెటర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ పాకిస్థాన్ ఆటగాళ్లతో, అధికారులతో షేక్ హ్యాండ్ చేయకుండా తమ వైఖరిని కొనసాగించారు. అయితే, మలేషియాలో అక్టోబర్ 14న జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2025 హాకీ మ్యాచ్‌లో మాత్రం పరిస్థితి మారింది. భారత్ U-21 జట్టు, పాకిస్థాన్ జూనియర్ హాకీ ప్లేయర్స్‌తో మ్యాచ్‌కు ముందు హ్యాండ్‌షేక్ ఇవ్వడం, హై-ఫైవ్ ఇవ్వడం జరిగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ హాకీ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు ఒకరికొకరు హై-ఫైవ్ ఇచ్చుకున్నారు. ఈ సంఘటన హ్యాండ్‌షేక్ వివాదానికి ముగింపు పలికినట్లు క్రీడాభిమానులు భావిస్తున్నారు. వాస్తవానికి, ఈ మ్యాచ్ కంటే ముందే, పాకిస్థాన్ హాకీ సమాఖ్య తమ జూనియర్ జట్టుకు నో-హ్యాండ్‌షేక్ పరిస్థితికి సిద్ధంగా ఉండాలని, భారత జట్టు హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి నిరాకరిస్తే, దానిని పట్టించుకోవద్దని, భారత ఆటగాళ్లతో భావోద్వేగంగా ఎలాంటి వాదనకు లేదా ఘర్షణకు దిగొద్దని ఆదేశాలు జారీ చేసింది. గతంలో పాకిస్థాన్ హాకీ జట్టు భారత్‌కు ఆడటానికి రాలేదు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అధికంగా ఉండేవి.
ఈ వివాదం సరిగ్గా సెప్టెంబర్ 14న జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌తో మొదలైంది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా భారత జట్టు నో హ్యాండ్‌షేక్ విధానాన్ని అమలు చేసింది. ఆ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి నిరాకరించాడు.
Indian 🇮🇳 and Pakistani 🇵🇰 players had a hand shake before the start of Sultan of Johor Cup Hockey Match 😮 pic.twitter.com/gWMutT6ote
— Richard Kettleborough (@RichKettle07) October 14, 2025
తొలి మ్యాచ్‌లో మాత్రమే కాకుండా, సూపర్-4, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లలో కూడా భారత క్రికెట్ జట్టు ఇదే నో హ్యాండ్‌షేక్ విధానాన్ని కొనసాగించింది. మ్యాచ్‌లు గెలిచిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ టీమ్‌తో షేక్ హ్యాండ్ చేయకుండానే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఫైనల్ గెలిచిన తరువాత భారత జట్టు ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి కూడా నిరాకరించింది. ఫలితంగా నఖ్వీ ట్రోఫీని తమతో తీసుకెళ్లారు. ఆ ట్రోఫీ ఇప్పటికీ భారత జట్టుకు అందలేదని సమాచారం. ఈ వివాదం మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ కొనసాగింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..