
India A vs New Zealand A: భారత్ ఏ, న్యూజిలాండ్ ఏ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ముగింపునకు ముందు రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. భారత్ ఏ తొలి ఇన్నింగ్స్ స్కోరు 346కు సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఏ ఒక దశలో 338/8తో కష్టాల్లో పడింది. కానీ చివరి రెండు వికెట్లకు ఏకంగా 86 పరుగులు జోడించి, తొలి ఇన్నింగ్స్‌ను 424 పరుగుల వద్ద ముగించింది. దీంతో ఆతిథ్య జట్టుకు 78 పరుగుల విలువైన ఆధిక్యం దక్కింది.
భారత బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ (Mukesh Kumar) అద్భుతంగా రాణించాడు. 29 ఓవర్లు వేసిన ఈ పేసర్ 87 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ప్రణాళికల నుంచి పక్కకు వెళ్లిన ఈ బౌలర్ ఇలాంటి ప్రదర్శనతో సెలెక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు.
రెండు టెస్టుల సిరీస్‌కు ముందు మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చక్కటి వార్మప్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 35 ఓవర్లు బౌలింగ్ చేసి 118 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. వీరిద్దరూ కలిసి కివీస్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం వికెట్లను పంచుకున్నారు. అయినా లోయర్ ఆర్డర్‌లో కివీస్ బ్యాటర్లు చూపిన పోరాటం భారత్ ఏ జట్టుకు తలనొప్పిగా మారింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఏ, రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 20, సాయి సుదర్శన్ (Sai Sudharsan) 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిగిలిన 11 ఓవర్లను ఈ ఇద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడేశారు. ఇప్పుడు చివరి రోజు భారత్ ఏ బ్యాటర్లు ఎంతవరకు పోరాడతారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..