IND vs WI 4th T20I: ఇండోర్‌లో వద్దని పక్కన పెట్టేశారు.. హైదరాబాద్‌లోనే నువ్వే దిక్కంటూ పిలుపు..!

Hyderabad T20 pitch report: వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి భారత్ సిద్ధమవుతోంది. సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో కీలక ప్లేయింగ్ ఎలెవన్ మార్పులు ఉండనున్నాయి. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పునరాగమనం, శివమ్ దూబే లేదా నితీష్ కుమార్ రెడ్డిలలో ఎవరిని ఆడించాలనేది ప్రధాన సందిగ్ధత. ఆకాశ్ చోప్రా విశ్లేషణ ప్రకారం హైదరాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం.

IND vs WI 4th T20I: ఇండోర్‌లో వద్దని పక్కన పెట్టేశారు.. హైదరాబాద్‌లోనే నువ్వే దిక్కంటూ పిలుపు..!
Ind Vs Wi

Updated on: Oct 14, 2026 | 2:29 PM

Hyderabad T20 Pitch Report: వెస్టిండీస్‌తో బుధవారం హైదరాబాద్‌లో జరగనున్న నాలుగో టీ20 కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. మూడో టీ20లో భారత్ ఉత్కంఠభరితంగా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లో 69 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ గట్టిగా పోరాడినా.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచింది.

హైదరాబాద్‌లోని పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండొచ్చని భావిస్తున్న మాజీ భారత ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. నాలుగో టీ20లో కుల్దీప్ యాదవ్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతడి కోసం ప్రిన్స్ యాదవ్ లేదా మయాంక్ యాదవ్‌లలో ఒకరిని పక్కన పెట్టే అవకాశం ఉందని అంచనా వేశాడు.

“వరుణ్ ఆరోన్ చెప్పిన ప్రకారం పిచ్‌ను మళ్లీ సిద్ధం చేశారు. దీంతో బౌలర్లకు కొంత సహకారం లభించే అవకాశం ఉంది. గ్రౌండ్ కూడా మంచి పరిమాణంలోనే ఉంది. ఇక్కడ ఎక్కువ పరుగులు వస్తుండటంతో చిన్న మైదానంలా కనిపిస్తుంది. గతంలో ఇక్కడ బ్యాటింగ్‌కు పరిస్థితులు బాగా అనుకూలంగా ఉండేవి. అయితే ఐపీఎల్ ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్‌లు నెమ్మదించడాన్ని చూశాం. తొలి అర్ధభాగంతో పోలిస్తే తర్వాత తక్కువ పరుగులు నమోదయ్యాయి” అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పాడు.

“ఇది ఫ్లాట్ పిచ్ కాకపోవడంతో పాటు మైదానం కూడా చిన్నది కాదు. కాబట్టి మీరు కుల్దీప్ యాదవ్‌ను తప్పకుండా ఆడించాలి. అయితే ఎవరిని తప్పించి కుల్దీప్‌ను తీసుకుంటారనేది పెద్ద ప్రశ్న. నంబర్ 8 స్థానంలో బ్యాటర్ అవసరం కాబట్టి ప్రిన్స్ లేదా మయాంక్‌లో ఒకరు బెంచ్‌పై కూర్చోవాల్సి ఉంటుంది. అప్పుడు ముగ్గురు బౌలర్లతోనే ఆడాల్సి వస్తుంది” అని ఆయన పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో తొలి టీ20లో కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే రెండో మ్యాచ్‌లో అతడికి అంతగా కలిసిరాలేదు. నాలుగు ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో మూడో టీ20లో జట్టు మేనేజ్‌మెంట్ కుల్దీప్‌ను పక్కన పెట్టి ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో కూడిన బౌలింగ్ కాంబినేషన్‌ను భారత్ ఎంచుకుంది.

ఆల్‌రౌండర్ల విషయంలోనూ జట్టు మేనేజ్‌మెంట్‌కు మరో సందిగ్ధత ఉండొచ్చని చోప్రా అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలో ఎవరిని ఆడించాలనే నిర్ణయం కీలకం కావచ్చన్నాడు. అయితే హైదరాబాద్ పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న నితీశ్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు.

“రెండో ప్రశ్న.. శివమ్ దూబేను తిరిగి తీసుకురావాలనుకుంటున్నారా? అతడిని తప్పించడానికి అతడు ఎలాంటి తప్పూ చేయలేదు. అయితే నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. ఈ మైదానం గురించి అతడికి బాగా తెలుసు. గత మ్యాచ్‌లో బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీశాడు. బ్యాటింగ్‌లోనూ అతడు బాగానే ఆడగలడు. కాబట్టి అతడినే కొనసాగించాలా అనేది ఆలోచించాలి” అని చోప్రా చెప్పాడు.

“ఇది తప్ప ఈ జట్టులో మరిన్ని మార్పులు కనిపించడం లేదు. మార్పులు చేయడానికి పెద్దగా అవకాశం కూడా లేదు. మైదానం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కుల్దీప్ యాదవ్‌ను మరోసారి చూడాలని నేను కోరుకుంటున్నాను. అతడి కోసం ఏ యాదవ్‌ను తప్పించాలనేది మాత్రం స్పష్టంగా చెప్పలేను. ప్రిన్స్ యాదవ్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది” అని చోప్రా తెలిపాడు.

వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి భారత్ అంచనా తుది జట్టు

సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్.

Loading...
Unable to load recommendations.
Follow Us