Ind Vs NZ : సొంతగడ్డపై టీమిండియాకు షాక్..సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత డైలాగ్

Ind Vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత వన్డే సిరీస్‌లో టీమిండియాకు పరాభవం ఎదురైంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో కివీస్ జట్టు 41 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది.

Ind Vs NZ : సొంతగడ్డపై టీమిండియాకు షాక్..సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత డైలాగ్
Shubman Gill

Updated on: Jan 19, 2026 | 2:44 PM

Ind Vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత వన్డే సిరీస్‌లో టీమిండియాకు పరాభవం ఎదురైంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో కివీస్ జట్టు 41 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. 2010 తర్వాత భారత్ తన సొంత గడ్డపై వన్డే సిరీస్ ఓడిపోవడం ఇది కేవలం ఐదోసారి మాత్రమే. ఈ ఘోర ఓటమి ఇప్పుడు భారత జట్టు ఎంపిక, కెప్టెన్సీ మీద అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

శుభ్‌మన్ గిల్ రొటీన్ మాటలు

మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఓటమిపై స్పందిస్తూ.. “మేము ఎక్కడ తప్పు చేశామో వెనక్కి వెళ్లి చూసుకోవాలి. దాని గురించి ఆలోచించాలి, మళ్ళీ మెరుగ్గా ఆడటానికి ప్రయత్నించాలి” అంటూ గిల్ చెప్పుకొచ్చాడు. ప్రతిసారి ఓడిపోయినప్పుడు కెప్టెన్లు చెప్పే ఈ ఘీసా-పిటా(పాత రోత) డైలాగులే గిల్ మళ్ళీ వల్లెవేయడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. సిరీస్ 1-1తో సమానంగా ఉన్నప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో ఇంత పేలవంగా ఆడటం నిరాశ కలిగించిందని అతడు అంగీకరించాడు.

విరాట్ అద్భుత సెంచరీ.. కానీ ఫలితం సున్నా

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. కోహ్లీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లో 54వ సెంచరీ నమోదు చేశాడు. గిల్ కూడా విరాట్ ఆటతీరును కొనియాడుతూ, విరాట్ ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ అని చెప్పాడు. అయితే, మిగతా సీనియర్ బ్యాటర్లు విఫలం కావడంతో కోహ్లీ సెంచరీ వృధా అయింది. భారత జట్టు 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయింది.

హర్షిత్, నితీష్ అదుర్స్

ఓటమిలోనూ భారత్‌కు కొన్ని సానుకూల అంశాలు లభించాయి. ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత్ రాణా ఒత్తిడిలో అద్భుత హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా 53 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భవిష్యత్తులో జరగబోయే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నామని, నితీష్ వంటి వారికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని గిల్ అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్ కొంపముంచింది.

వరల్డ్ కప్ సన్నాహాలు.. సరైన దారిలోనేనా?

న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్టు చేతిలో హోమ్ సిరీస్ ఓడిపోవడం భారత సెలెక్టర్లకు ఒక హెచ్చరిక లాంటిది. టాప్ ఆర్డర్ వైఫల్యం, బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. కివీస్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను సైతం సునాయాసంగా ఎదుర్కోవడం గమనార్హం. రాబోయే మెగా టోర్నీలకు ముందు ఈ తప్పులను సరిదిద్దుకోకపోతే టీమిండియాకు కష్టాలు తప్పవు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..