IND vs IRE : రాజస్థాన్ కుర్రాడే భారత్‌ను దెబ్బకొట్టాడు.. ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం వెనుక అసలు కథ ఇదీ

IND vs IRE : ఐర్లాండ్ చారిత్రాత్మక విజయంలో అరంగేట్ర ఆటగాళ్లు మ్యాట్ హాలండ్, రాజస్థాన్‌కు చెందిన జై మూంద్రా హీరోలుగా నిలిచారు. భారత్‌పై ఐదు కీలక వికెట్లు తీసి ప్రపంచ ఛాంపియన్లకు ఊహించని షాక్ ఇచ్చి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు.

IND vs IRE :  రాజస్థాన్ కుర్రాడే భారత్‌ను దెబ్బకొట్టాడు.. ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం వెనుక అసలు కథ ఇదీ
Ind Vs Ire

Updated on: Jun 27, 2026 | 11:10 AM

IND vs IRE : ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన ఈ పోరులో 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టులో కెప్టెన్ లార్కాన్ టక్కర్ (50), గారెత్ డెలానీ (49) రాణించగా, ఆ తర్వాత బౌలింగ్‌లో ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లు మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు. సౌతాఫ్రికాలో జన్మించిన మ్యాట్ హాలండ్, భారతదేశంలోని రాజస్థాన్‌కు చెందిన జై మూంద్రా కలిసి భారత జట్టుకు చెందిన ఐదు కీలక వికెట్లను పడగొట్టి ఐర్లాండ్ దేశానికి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

ఒకే క్లబ్ నుంచి వచ్చిన ఇద్దరు హీరోలు

మ్యాట్ హాలండ్, జై మూంద్రా ఇద్దరూ డబ్లిన్‌లోని ప్రసిద్ధ బాల్బ్రిగ్గన్ క్రికెట్ క్లబ్ తరఫున లోకల్ లీగ్స్ ఆడేవారు. ఈ క్లబ్ 1961 నుంచి నడుస్తున్నప్పటికీ, ఇక్కడి నుంచి ఒక్క ఆటగాడు కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ క్లబ్ నుంచి ఒకేసారి ఇద్దరు ఆటగాళ్లు ఐర్లాండ్ జెర్సీ ధరించి బరిలోకి దిగడమే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత బలమైన భారత జట్టును ఓడించి తమ క్లబ్ పేరును రాత్రికి రాత్రే మార్చేశారు. ఈ విజయం తమ క్లబ్ సభ్యులకు ఎంతో గర్వకారణమని వారు తెలిపారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాట్ హాలండ్ కథ

ఈ మ్యాచ్‌లో 27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హాలండ్ 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఆయన ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ లాంటి కీలక వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాలోని బోక్స్ బర్గ్‌లో పుట్టి పెరిగిన హాలండ్‌కు అక్కడ సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఆయన సోదరుడు బలవంతం చేయడంతో క్రికెట్ ఆడేందుకు ఐర్లాండ్ వచ్చాడు. సీనియర్ బౌలర్ల గాయాల కారణంగా జట్టులోకి వచ్చిన హాలండ్, తన అరంగేట్ర మ్యాచ్‌ను చూడటానికి సౌతాఫ్రికా నుంచి తన కుటుంబ సభ్యులను రప్పించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హాలండ్ తన కుటుంబ సభ్యులను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు.

ఇండియా కుర్రాడు జై మూంద్రా సంచలనం

మరోవైపు ఐర్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ జై మూంద్రా పుట్టింది మన ఇండియాలోనే. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాకు చెందిన జై మూంద్రా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి డబ్లిన్ వెళ్లాడు. చదువుకుంటూనే వీకెండ్లో లోకల్ క్లబ్స్ తరఫున క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆయన బంతిని చాలా వేగంగా విసరడం చూసి డబ్లిన్‌లోని క్లబ్స్ ఆయన కోసం క్యూ కట్టాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను వేసిన మొదటి బంతికే సంజూ శాంసన్ లాంటి స్టార్ బ్యాటర్‌ను అవుట్ చేసి జై మూంద్రా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us