IND vs IRE : పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోరంగా బొక్కబోర్లా పడ్డ భారత్.. ఓటమికి 3 కారణాలివే

IND vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20 లో టీమ్ ఇండియా 34 పరుగుల తేడాతో చారిత్రాత్మక ఓటమి చవిచూసింది. టాస్ నిర్ణయం, ప్రసిద్ధ్ కృష్ణ ఖరీదైన బౌలింగ్, బ్యాటర్ల బాధ్యతారాహిత్యమైన షాట్లు భారత్ పరాజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

IND vs IRE : పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోరంగా బొక్కబోర్లా పడ్డ భారత్.. ఓటమికి  3 కారణాలివే
Ind Vs Ire

Updated on: Jun 27, 2026 | 7:20 AM

IND vs IRE : భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక అవమానకరమైన రికార్డు నమోదైంది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బలహీనమైన ఐర్లాండ్ జట్టు చేతిలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియా 34 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ జట్టు భారత్‌ను ఓడించడం ఇదే తొలిసారి కావడంతో ఈ ఓటమి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 182 పరుగుల భారీ స్కోరు సాధించగా, లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది.

తొలి తప్పు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం

ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి టాస్ నిర్ణయం పెద్ద మైనస్ గా మారింది. బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానం పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైనది. ఇలాంటి పిచ్‌పై టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ తీసుకోకుండా, బౌలింగ్ ఎంచుకుని పెద్ద తప్పు చేశాడు. భారత్ గనుక మొదట బ్యాటింగ్ చేసి ఉంటే ఈజీగా 200 పైగా పరుగులు బోర్డుపై పెట్టే అవకాశం ఉండేది. కానీ మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి 182 పరుగుల భారీ టోటల్‌ను నిర్మించింది.

రెండో తప్పు.. ప్రసిద్ధ్ కృష్ణతో 4 ఓవర్లు వేయించడం

భారత పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఫామ్ కోల్పోయి ప్రసిద్ధ్ కృష్ణ తన మొదటి ఓవర్ లోనే ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ ఏమీ తీయకుండా 30 పరుగులు ఇచ్చాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వద్ద ఇతర బౌలింగ్ ఆప్షన్లు ఉన్నప్పటికీ, ప్రసిద్ధ్ కృష్ణపై మితిమీరిన నమ్మకంతో అతనికి నాలుగో ఓవర్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్ లో కృష్ణ ఏకంగా 27 పరుగులు ఇచ్చుకుని, తన 4 ఓవర్ల కోటాలో మొత్తం 57 పరుగులు సమర్పించుకుని భారత్ కొంపముంచాడు.

మూడో తప్పు.. బ్యాటర్ల తొందరపాటు ఆటతీరు

183 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ (50 రన్స్) చేసినప్పటికీ మిగిలిన వారి నుంచి సహకారం అందలేదు. కేవలం 60 పరుగులకే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా 3 వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాత 80 పరుగుల వద్ద అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. వికెట్లు పడుతున్నా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పార్ట్‌నర్‌షిప్ నిర్మించకుండా, తొందరపాటుతో భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు పారేసుకోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us