Watch : అరె ఏంట్రా ఇది.. బ్యాట్‌కు, బంతికి కిలోమీటర్ దూరం.. క్రికెట్ హిస్టరీలోనే వరస్ట్ డీఆర్ఎస్

Watch : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అఫ్గన్ చేసిన డీఆర్‌ఎస్ రివ్యూ పెద్ద వివాదంగా మారింది. మహమ్మద్ సిరాజ్‌పై తీసుకున్న తప్పు రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 120వ ఓవర్ వేస్తున్న సమయంలో ఈ కామెడీ సీన్ జరిగింది.

Watch : అరె ఏంట్రా ఇది.. బ్యాట్‌కు, బంతికి కిలోమీటర్ దూరం.. క్రికెట్ హిస్టరీలోనే  వరస్ట్ డీఆర్ఎస్
Ind Vs Afg

Updated on: Jun 07, 2026 | 3:26 PM

Watch : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ రెండో రోజు ఆటలో అఫ్గానిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన, హాస్యాస్పదమైన డీఆర్ఎస్ రివ్యూ తీసుకుని నవ్వులపాలైంది. అంతకుముందు ముగ్గురు భారత అగ్రశ్రేణి బ్యాటర్లను అవుట్ చేసే అద్భుతమైన అవకాశాలను రివ్యూ తీసుకోకుండా జారవిడుచుకున్న అఫ్గాన్ జట్టు.. చివర్లో 9వ నంబర్ బ్యాటర్ మహమ్మద్ సిరాజ్‌పై అనవసరంగా రివ్యూకు వెళ్లి తమ వద్ద ఉన్న విలువైన రివ్యూను వృథా చేసుకుంది.

సిరాజ్ బ్యాట్‌కు చాలా దూరం

భారత్ తొలి ఇన్నింగ్స్ 120వ ఓవర్ వేస్తున్న సమయంలో ఈ కామెడీ సీన్ జరిగింది. అఫ్గాన్ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే వేసిన బంతిని మహమ్మద్ సిరాజ్ స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లగా.. క్లోజ్-ఇన్ ఫీల్డర్లు ఏదో శబ్దం వచ్చిందంటూ గట్టిగా అప్పీల్ చేశారు. ఫీల్డర్ల మాటలు నమ్మిన అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే డీఆర్ఎస్ రివ్యూ కోరాడు. అయితే టీవీ రీప్లేలో చూస్తే అసలు బంతికి, బ్యాట్‌కు మధ్య కొండంత దూరం ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటౌట్‌గా ప్రకటించాడు.

రివ్యూ అడిగినందుకు సిరాజ్ రిటర్న్ గిఫ్ట్

అఫ్గానిస్తాన్ తీసుకున్న ఈ అనవసర రివ్యూ వారిపైనే కాకుండా బౌలర్‌పై కూడా మానసిక ఒత్తిడిని పెంచింది. ఈ డీఆర్ఎస్ డ్రామా ముగిసిన వెంటనే క్రీజులో ఉన్న మహమ్మద్ సిరాజ్.. అఫ్గాన్ స్పిన్నర్ ఖరోటేకు గట్టి బుద్ధి చెప్పాడు. ఆ తర్వాతి బంతిని ఏకంగా భారీ సిక్సర్‌గా మలిచిన సిరాజ్.. ఆ వెనువెంటనే వచ్చిన రెండు బంతులను వరుసగా బౌండరీలకు తరలించి ఒకే ఓవర్లో ఊచకోత కోశాడు. దీంతో అనవసరంగా రివ్యూ అడిగి తప్పు చేశామని అఫ్గాన్ ఆటగాళ్లు మైదానంలోనే తలలు పట్టుకున్నారు.

ముగ్గురు స్టార్ బ్యాటర్లకు లైఫ్ లైన్

నిజానికి ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు మూడు సార్లు భారత బ్యాటర్లను అవుట్ చేసే అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాట్‌కు బంతి స్పష్టంగా తగిలి కీపర్ చేతికి వెళ్లినా అఫ్గాన్ ప్లేయర్లు రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత రాహుల్ సెంచరీ (100) బాది జట్టును ఆదుకున్నాడు. అలాగే రెండో రోజు లంచ్ విరామానికి ముందు క్రీజులో పాతుకుపోయిన శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఇద్దరిని అవుట్ చేసే క్లియర్ ఛాన్సులు వచ్చినా అఫ్గాన్ కెప్టెన్ రివ్యూ తీసుకోకుండా నిర్లక్ష్యం వహించాడు. ఆ తర్వాత గిల్ 126 పరుగులు, పంత్ 81 పరుగులు చేసి భారత్‌కు భారీ స్కోరు అందించారు.

భారీ ఇన్నింగ్స్‌తో భారత్ డిక్లేర్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ను 127 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. గిల్ (126), రాహుల్ (100) సెంచరీలతో కదం తొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషభ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సలీమ్ అత్యంత శ్రమించి 27 ఓవర్లలో 140 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. జియౌర్ రెహమాన్, కెప్టెన్ షాహిదీ చెరో వికెట్ సాధించారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us