
IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ప్రారంభంలోనే మ్యాచ్‌పై పట్టు సాధించే సువర్ణావకాశం లభించింది. కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మలు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం కారణంగా అఫ్గానిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ భారీ ఇన్నింగ్స్‌తో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకవేళ ఆ సమయంలో భారత్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉంటే గుర్బాజ్ కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరేవాడు.
48 బంతుల్లోనే నయా హిస్టరీ
ధర్మశాలలో కురిసిన భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు చెరో 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఓవర్లు తక్కువగా ఉండటంతో గుర్బాజ్ మొదటి బంతి నుంచే జెట్ స్పీడ్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతను కేవలం 48 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకని సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గానిస్తాన్ తరఫున ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లో భారత్‌పై 50 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా గుర్బాజ్ నిలిచాడు. గతంలో 2005లో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది 45 బంతుల్లో భారత్‌పై ఈ ఘనత సాధించగా.. మళ్లీ 21 ఏళ్ల తర్వాత గుర్బాజ్ ఆ రికార్డుకు సమీపంలోకి వచ్చాడు.
భారత జట్టు చేసిన ఆ బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటి?
అసలు మ్యాటర్ ఏంటంటే.. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన బంతితో గుర్బాజ్‌ను పూర్తిగా బురిడీ కొట్టించాడు. ఆ బంతి నేరుగా వెళ్లి గుర్బాజ్ ఎడమ ప్యాడ్‌కు బలంగా తాకింది. భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ మాత్రం నాటౌట్ అని ప్రకటించాడు. ఆ సమయంలో బంతి మొదట బ్యాట్‌కు తగిలి ప్యాడ్‌కు తగిలిందేమోనని కెప్టెన్ గిల్, రోహిత్ శర్మ గందరగోళానికి గురై రివ్యూ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అప్పుడు గుర్బాజ్ స్కోర్ కేవలం 11 పరుగులు మాత్రమే.
రీప్లే చూసి తలలు పట్టుకున్న టీమ్ మేనేజ్‌మెంట్
ఆ తర్వాత కొద్దిసేపటికి టీవీ స్క్రీన్‌లపై ఆ బంతికి సంబంధించిన రీప్లే, బాల్ ట్రాకింగ్‌ను ప్రదర్శించారు. అందులో బంతి బ్యాట్‌కు ఎక్కడా తగల్లేదని, నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్ పైభాగాన్ని బలంగా తాకుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ భారత్ అక్కడ రివ్యూ తీసుకుని ఉంటే థర్డ్ అంపైర్ ఖచ్చితంగా అవుట్ ఇచ్చేవాడు. ఈ భారీ లైఫ్ లైన్‌ను రెండు చేతులా వాడుకున్న గుర్బాజ్.. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సూపర్ యార్కర్
గుర్బాజ్ ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 51 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 200.00 స్ట్రైక్ రేట్‌తో 102 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న అతని ఇన్నింగ్స్‌కు భారత యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒక అద్భుతమైన యార్కర్ బంతితో క్లీన్ బౌల్ చేసి ఎండ్ కార్డ్ వేశాడు. గుర్బాజ్ అవుట్ అయినప్పటికీ.. రోహిత్, గిల్ చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటు వల్ల అఫ్గానిస్తాన్ జట్టు మ్యాచ్‌లో భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది.
మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.