ఐసీసీ పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ICC Men’s T20I Batting Rankings)లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)లు ఉత్తమ స్థానాలు పొందారు . వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో వారి అద్భుతమైన ప్రదర్శనలతో ఇద్దరూ ప్రయోజనం పొందారు. ఈ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. మరోవైపు భారత బ్యాట్స్‌మెన్‌లలో వెంకటేష్ అయ్యర్ పరుగులు చేయడంలో రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్య 35 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు వెంకటేష్ 203 స్థానాలు ఎగబాకి 115వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
మరోవైపు కేఎల్ రాహుల్‌కు మాత్రం కష్టాలు తప్పలేదు. రెండు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి చేరుకున్నాడు. అయినా రాహుల్ ఇప్పటికీ ICC ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. అదే సమయంలో, బౌలర్లు, ఆల్ రౌండర్ల టాప్-10 జాబితాలో ఏ భారతీయుడు కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 20వ ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఏ భారతీయ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్.
పూరన్ 5 స్థానాలు జంప్..
వెస్టిండీస్ తరఫున బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఏకైక ఆటగాడు నికోలస్ పూరన్.. ఐదు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య ముగిసిన టీ20 అంతర్జాతీయ సిరీస్ కూడా ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. ఆస్ట్రేలియా ఆటగాడు అష్టన్ అగర్ బౌలర్లలో టాప్ 10 ర్యాంకింగ్స్‌లోకి చేరాడు. ప్రస్తుతం తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో శ్రీలంక మంచి ప్రదర్శనతో మహిష్ తీక్ష్ణ కెరీర్-బెస్ట్ రేటింగ్ 592 సాధించి, 12 స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు.
టెస్టు ర్యాంకింగ్స్‌లో భారతీయుల పరిస్థితీ..
టెస్టు ర్యాంకింగ్స్‌లో, భారత కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా, కోహ్లి ఒక స్థానం వెనుకబడి ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండు, 10వ స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో ర్యాంక్‌ను కొనసాగించగా, రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ తర్వాత, కైల్ జేమీసన్, టిమ్ సౌథీలు వరుసగా మూడు, ఐదవ స్థానాలకు ఎగబాకారు.
Also Read: IND vs SL: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. శ్రీలంక సిరీస్‌కు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్..!