
ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్‌లో ముంబై ఇండియన్స్ కూడా ఒకటి. ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చ్ 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. అయితే.. ఈ ఐపీఎల్ 2025 ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. అదేంటంటే.. ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యాపై నిషేధం విధించారు. అతన్ని ఒక మ్యాచ్ ఆడకుండా బ్యాన్ చేశారు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఆడబోయే తొలి మ్యాచ్‌కు హార్థిక్ పాండ్యా దూరం కానున్నాడు. అదేంటి ఇంకా సీజన్ స్టార్ట్ కాకుండానే నిషేధం ఏంటి? అసలు పాండ్యా ఏం తప్పు చేశాడని అనుకుంటున్నారా? గతేడాది అంటే 2024 ఐపీఎల్ సీజన్ సమయంలో హార్థిక్ పాండ్యా చేసిన తప్పే ఇప్పుడు అతనిపై నిషేధానికి కారణం అయ్యింది.
ఐపీఎల్ 2024 సందర్భంగా ముంబై గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. అయితే తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడింది ముంబై ఇండియన్స్. ఆ మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో 30 శాతం, మిగతా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 12 శాతం కోత విధించారు. అయితే ఈ స్లో ఓవర్ రేట్ అనేది ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడో సారి చేయడంతో ఆ జట్టు కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. అయితే.. అప్పటికే ముంబై ఇండియన్స్ ఆ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడేయడంతో వచ్చే సీజన్ అంటే ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌ను ఆడకుండా బ్యాన్ విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. సో ఇలా హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్‌కే దూరం కానున్నాడు.
మరి పాండ్యా లేకుంటే ముంబై ఇండియన్స్‌కి తొలి మ్యాచ్‌లో కెప్టెన్ ఎవరు వ్యవహరిస్తారనే డౌట్ రావొచ్చు. ముంబైని ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకే ఆ బ్యాధతలు అప్పగిస్తారనే టాక్ ఉన్నప్పటికీ.. అందుకే రోహిత్ ఒప్పుకుంటాడా? లేదా? అన్నది కీలకం. ఇక జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరిలో ఒకరికి ఆ ఒక్క మ్యాచ్ కోసం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చూడాలి మరి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తుందో.