
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. గాయం కారణంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న అతడికి తాజాగా మరో నిరాశ ఎదురైంది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం బరోడా జట్టును ప్రకటించగా, అందులో హార్దిక్‌కు చోటు దక్కలేదు. నవంబర్ 14 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. హార్దిక్ సోదరుడు క్రునాల్ పాండ్యా బరోడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దేశవాళీ క్రికెట్ ద్వారా తిరిగి ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకుంటాడని అభిమానులు ఆశించినా.. తాజా జట్టు ప్రకటనతో ఆ ఆశలకు బ్రేక్ పడింది.
పిక్క కండరాల గాయంతో రిహాబ్‌లో హార్దిక్
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పిక్క కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గాయం నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్ ప్రక్రియలో ఉన్నాడు. అయితే అతడి ఫిట్‌నెస్‌పై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చినా, బరోడా జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ అవకాశాలు కనిపించడం లేదు. హార్దిక్ ఎప్పుడు పూర్తిస్థాయిలో కోలుకుంటాడు? ఎప్పుడు మళ్లీ క్రికెట్ ఆడతాడు? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లేదు. దీంతో అతడి పునరాగమనంపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఐపీఎల్ 2026 తర్వాత మైదానానికి దూరం
హార్దిక్ చివరిసారిగా ఐపీఎల్ 2026లో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ఇప్పటివరకు పోటీ క్రికెట్లో కనిపించలేదు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా-ఏ జట్టులో అతడికి చోటు లభించింది. అయితే గాయం కారణంగా సిరీస్ ప్రారంభానికి ముందే జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా బరోడా జట్టులోనూ అవకాశం దక్కకపోవడంతో అతడి రీఎంట్రీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు బరోడా జట్టులో జితేశ్ శర్మ, దీపక్ హుడా, రసిక్ సలామ్ దార్ వంటి ఆటగాళ్లు ఉండటం జట్టుకు బలంగా మారనుంది.
క్రునాల్ పాండ్యా కెప్టెన్సీలో బరోడా జట్టు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం బరోడా ప్రకటించిన జట్టుకు క్రునాల్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. అతీత్ సేథ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జితేశ్ శర్మ, దీపక్ హుడా, శివాలిక్ శర్మ, శాశ్వత్ రావత్, అమిత్ పాసి, భాను పనియా, మహేశ్ పిథియా, పరీక్షిత్ పాటీదార్, హేమంత్ పుండే, రాజ్ లింబానీ, రసిక్ దార్, ధ్రువ్ బి. పటేల్, సఫ్వాన్ పటేల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్లుగా అమిత్ పాసి, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. హార్దిక్ లేకపోయినా అనుభవం ఉన్న ఆటగాళ్లతో బరోడా బలమైన జట్టును సిద్ధం చేసుకుంది.
హార్దిక్ ఫిట్‌నెస్‌పై గిల్ కీలక వ్యాఖ్యలు
2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ టీమిండియా మేనేజ్మెంట్కు కీలకంగా మారింది. అతడు జట్టులోకి వస్తే లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా బలపడుతుందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గతంలో వ్యాఖ్యానించాడు. అయితే తిరిగి భారత జట్టులోకి రావడానికి ముందు దేశవాళీ క్రికెట్ ఆడి తన మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. అందుకే హార్దిక్ రీఎంట్రీకి పూర్తి ఫిట్నెస్ సాధించడం కీలకం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంతో అతడి రీఎంట్రీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..