Rahul Dravid Birthday: క్రికెట్ లెజెండ్, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన 49వ పుట్టినరోజు వేడుకను నేడు చేసుకోనున్నాడు. ప్రస్తుతం, ద్రవిడ్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. కోహ్లి నేతృత్వంలోని టీమిండియా నేడు దక్షిణాఫ్రికాతో తేల్చుకునే పనిలో లీనమయ్యారు. ఇందుకు తన వంతుగా కోచ్ రాహుల్ ద్రవిడ్ పూర్తి సన్నాహాలతో ఆటగాళ్లను సిద్ధం చేశాడు. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో మూడో టెస్టు మ్యాచ్ టీమిండియాకు ఎంతో కీలకమైంది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే దక్షిణాఫ్రికాలో భారత్ ఎన్నో రికార్డులను నెలకొల్పనుంది.
నవంబర్ 2021లో భారత క్రికెట్‌లో ‘ది వాల్’గా పేరుగాంచిన రాహుల్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. భారత మాజీ కెప్టెన్ 1996లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. 164 టెస్టులు ఆడి 13,288 పరుగులు చేశాడు. 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు పూర్తి చేశాడు.
అదే సంవత్సరంలో, ద్రవిడ్ సింగపూర్‌లో శ్రీలంకపై తన వన్డే అరంగేట్రం చేశాడు. 344 ODIలలో 10,889 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నేడు తన పుట్టినరోజు సందర్భంగా, భారత క్రికెట్‌లో ‘ది గ్రేట్ వాల్’ టాప్ రికార్డ్‌లను ఓసారి చూద్దాం..
రాహుల్ ద్రవిడ్ మొత్త పరుగులు:
భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అన్ని ఫార్మాట్లలో 24, 208 అంతర్జాతీయ పరుగులతో ముగించాడు.
టెస్టుల్లో 3వ స్థానంలో 10,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్:
ద్రవిడ్ నం. 3లో బ్యాటింగ్ చేసేవాడు. ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 10,000 పరుగులకు పైగా స్కోర్ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులు నెలకొల్పాడు. రాహుల్ 219 ఇన్నింగ్స్‌లలో 52.88 సగటుతో 10, 524 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో అతని కెరీర్‌లో 28 సెంచరీలు, 50 అర్ధసెంచరీలు ఉన్నాయి.
నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా నాలుగు సెంచరీలు:
నాలుగు వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ కొట్టిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లలో ద్రవిడ్ ఒకడిగా పేరుగాంచాడు. 2002లో ఇంగ్లండ్‌పై ఈ ఘనతను సాధించాడు. ఇందులో ద్రవిడ్ స్కోర్లు 115 (నాటింగ్‌హామ్), 148 (లీడ్స్), 217 (ది ఓవల్), ముంబైలో వెస్టిండీస్‌పై అజేయంగా 100 పరుగులు సాధించాడు.
సారథిగా ఆరు దేశాల్లో టెస్టు మ్యాచ్‌ల విజయం:
ద్రవిడ్ కెప్టెన్సీలో భారత్ స్వదేశంలో విజయాలతో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లలో టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది. అలాగే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి టెస్ట్ విజయానికి నాయకత్వం వహించాడు. 2004 ముల్తాన్ టెస్ట్ సమయంలో ప్రసిద్ధ ఇన్నింగ్స్ విజయంలో కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కనీసం ఒక టెస్టులో గెలిచిన మరే ఇతర కెప్టెన్ మూడు కంటే ఎక్కువ దేశాలకు కెప్టెన్‌గా ఉండలేదు.
టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు:
టెస్టుల్లో 210 క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ ఫీల్డర్ కూడా రికార్డును బ్రేక్ చేయలేదు. ద్రవిడ్ 164 టెస్ట్ కెరీర్‌లో డబుల్ సెంచరీ క్యాచ్‌లు తీసుకున్నాడు.
IND VS SA: స్పెషల్ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. మరో ఏడుగురు కూడా.. అవేంటంటే?