ఒకే మ్యాచ్‌తో రికార్డుల వేట.. 23 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియానయా పేసర్..!

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత యువ పేసర్ గర్నూర్ బ్రార్ సంచలనం సృష్టించాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ పేరిట ఉన్న 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. వెల్లింగ్టన్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించాడు.

ఒకే మ్యాచ్‌తో రికార్డుల వేట.. 23 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియానయా పేసర్..!
Gurnoor Brar Records

Updated on: Nov 07, 2026 | 1:45 PM

భారత క్రికెట్‌లో మరో యువ పేసర్ తన పేరును రికార్డుల పుస్తకంలో లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో గర్నూర్ బ్రార్ (Gurnoor Brar) అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. నవంబర్ 7న వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు మెయిడిన్లతో 30 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో భారత దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) పేరిట ఉన్న 23 ఏళ్ల రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో భారత బౌలర్‌గా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. గర్నూర్ దెబ్బకు కివీస్ జట్టు 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది.

జహీర్ ఖాన్ 23 ఏళ్ల రికార్డు బద్దలు..

వెల్లింగ్టన్‌లో భారత బౌలర్లకు సంబంధించిన రికార్డు గతంలో జహీర్ ఖాన్ పేరిట ఉండేది. 2003లో న్యూజిలాండ్‌తో ఇదే మైదానంలో జరిగిన వన్డేలో జహీర్ 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు గర్నూర్ బ్రార్ 4/30తో ఆ రికార్డును అధిగమించాడు.

వెల్లింగ్టన్‌లో వన్డేల్లో భారత బౌలర్ల అత్యుత్తమ గణాంకాలు:

గర్నూర్ బ్రార్ – 4/30 (2026)

జహీర్ ఖాన్ – 3/30 (2003)

యుజ్వేంద్ర చాహల్ – 3/41

జవగళ్ శ్రీనాథ్ – 2/24

అర్షుల్ కాంబోజ్ – 2/25

న్యూజిలాండ్ గడ్డపై మూడో అత్యుత్తమ ప్రదర్శన..

న్యూజిలాండ్‌లో భారత బౌలర్లు సాధించిన అత్యుత్తమ వన్డే గణాంకాల జాబితాలో గర్నూర్ మూడో స్థానానికి చేరుకున్నాడు. 1994లో వెల్లింగ్టన్‌లో అనిల్ కుంబ్లే 5/33తో అగ్రస్థానంలో ఉండగా, 2002లో ఆక్లాండ్‌లో జవగళ్ శ్రీనాథ్ 4/23తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గర్నూర్ 4/30తో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

కెరీర్‌లో తొలి నాలుగు వికెట్ల ఘనత..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత జట్టు తరఫున అంతర్జాతీయ వన్డేల్లో గర్నూర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేయలేదు. గతంలో 10 వన్డేలు ఆడిన అతడు ఇప్పుడు తన 11వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ 19 మ్యాచ్‌ల తర్వాత అతడికి ఇది రెండో నాలుగు వికెట్ల ప్రదర్శనగా నిలిచింది.

న్యూజిలాండ్‌కు మరో చెత్త రికార్డు..

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 134 పరుగులకే ఆలౌట్ కావడం మరో చర్చనీయాంశంగా మారింది. తొలి వన్డేలోనూ కివీస్ 185 పరుగులకే కుప్పకూలింది. ఒకే ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగుల లోపు ఆలౌట్ కావడం 2001 తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో న్యూజిలాండ్ ఈ పరిస్థితిని ఎదుర్కొంది.

భారత్‌తో స్వదేశంలో న్యూజిలాండ్ చేసిన అత్యల్ప వన్డే ఆలౌట్ స్కోర్లలో 134 పరుగులు ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాయి. దీంతో గర్నూర్ బ్రార్ ప్రదర్శన వ్యక్తిగత రికార్డుకే పరిమితం కాకుండా న్యూజిలాండ్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us