రిటైర్మెంట్‌ ప్రకటించిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌..! కానీ, ఇండియాలో జరిగే టోర్నీకి వస్తానంటూ..

గ్లెన్ మాక్స్వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో తన ప్రదర్శన నిరాశపరిచింది. వన్డేల్లో అతని అద్భుతమైన కెరీర్‌ను గుర్తుంచుకుంటూ, భవిష్యత్తులో టీ20లో అతని విజయాలను ఆశిద్దాం. వేలి గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ నుండి తప్పుకున్నాడు.

రిటైర్మెంట్‌ ప్రకటించిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌..! కానీ, ఇండియాలో జరిగే టోర్నీకి వస్తానంటూ..
Glenn Maxwell

Updated on: Jun 02, 2025 | 1:56 PM

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం (జూన్ 2) పాడ్‌కాస్ట్‌లో మ్యాక్సీ తన నిర్ణయం వెల్లడించాడు. అయితే 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ ఆడతానంటూ తన అభిమానులకు ఊరటనిచ్చాడు. ప్రస్తుతం అంత గొప్ప ఫామ్‌లో లేని మ్యాక్స్‌వెల్‌కు ఆసీస్‌ టీ20 టీమ్‌లో అయినా చోటు దక్కుతుందా అని అనుకుంటున్న టైమ్‌లో.. అతను వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించి, టీ20 వరల్డ్‌ కప్‌ ఆడతానంటూ ధీమా వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆడటం లేదు. సీజన్ ప్రారంభంలో పంజాబ్ కింగ్స్‌ తరఫున మ్యాక్సీ కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడారు. అయితే, ఇప్పుడు అతను జట్టులో ఎక్కడా కనిపించడం లేదు.

దీనికి కారణం అతని వేలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే భారతదేశం-పాకిస్తాన్ వివాదం కారణంగా ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేయబడటానికి ముందు అతను సీజన్ నుండి తప్పుకున్నాడు. మెగా వేలంలో మాక్స్వెల్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మ్యాక్సీ అంత గొప్పగా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో ఎనిమిది సగటుతో 48 పరుగులు మాత్రమే చేశాడు.

మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. ఇప్పటివరకు 141 మ్యాచ్‌లు ఆడి 23.88 సగటుతో 2819 పరుగులు సాధించాడు. 155.14 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. ఐపీఎల్‌లో మ్యాక్సీకి 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. తన వన్డే కెరీర్ విషయానికి వస్తే, మాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. 149 మ్యాచ్‌ల్లో 33.81 సగటుతో 3990 పరుగులు, 126.7 స్ట్రైక్ రేట్‌తో నాలుగు సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్‌పై గాయంతో బాధపడుతూ.. డబుల్‌ సెంచరీ చేసి మ్యాచ్‌ గెలిచిన ఇన్నింగ్స్‌ అయితే మ్యాక్స్‌వెల్‌ జీవితంలో మరుపురాని ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..