Indian Sports Calendar 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి ఆసియా క్రీడల వరకు.. క్రీడాభిమానులకు ఫుల్ పండగే

Indian Sports Calendar: 2026 సంవత్సరం భారత క్రీడారంగానికి ఒక అద్భుతమైన సంవత్సరంగా నిలవనుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యం నుంచి ఆసియా క్రీడల వరకు, క్రీడాభిమానులకు వినోదాన్ని పంచే పూర్తి షెడ్యూల్ సిద్దమైంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

Indian Sports Calendar 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి ఆసియా క్రీడల వరకు.. క్రీడాభిమానులకు ఫుల్ పండగే
Sports Event Schedule 2026

Updated on: Jan 01, 2026 | 7:49 AM

Sports Event Schedule 2026: 2026 సంవత్సరం భారత క్రీడారంగానికి ఒక అద్భుతమైన, సవాలుతో కూడిన సంవత్సరంగా నిలవనుంది. ప్రపంచ టైటిళ్లతో పాటు, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు సంబంధించిన తొలి అర్హత బెర్తుల కోసం క్రీడాకారులు ఈ ఏడాది నుంచే పోరాడనున్నారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు అభిమానులను అలరించే పూర్తి షెడ్యూల్ ఇక్కడ ఉంది.

తొలి త్రైమాసికం (జనవరి – మార్చి): క్రికెట్ పండుగ

సంవత్సరం ఆరంభంలోనే క్రికెట్ సందడి మొదలవుతుంది. ఈ మూడు నెలల్లో మూడు ప్రధాన ప్రపంచ కప్‌లు జరగనున్నాయి.

అండర్-19 వరల్డ్ కప్: జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి యువ తారలపై అందరి కళ్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

టీ20 వరల్డ్ కప్ 2026: ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతోంది.

బ్యాడ్మింటన్: మార్చి 3 నుంచి ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్’ ప్రారంభమవుతుంది. పీవీ సింధు, ఇతర స్టార్ క్రీడాకారులు తమ ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఇది కీలకం.

ఫుట్‌బాల్: మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే ‘AFC మహిళల ఆసియా కప్’లో భారత జట్లు తలపడనున్నాయి.

రెండో త్రైమాసికం (ఏప్రిల్ – జూన్): చదరంగం, ఐపీఎల్..

చదరంగం (Chess): మార్చి 28 నుంచి ఏప్రిల్ 16 వరకు సైప్రస్‌లో ‘కాండిడేట్స్ టోర్నమెంట్’ జరుగుతుంది. ఇందులో ప్రజ్ఞానంద, వైశాలి, కోనేరు హంపి వంటి వారు పాల్గొంటారు.

వెయిట్ లిఫ్టింగ్: ఏప్రిల్ 1 నుంచి 10 వరకు అహ్మదాబాద్‌లో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు.

మహిళల టీ20 వరల్డ్ కప్: జూన్ నెలలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మరో ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టనుంది.

అథ్లెటిక్స్: మే నెలలో డైమండ్ లీగ్ ప్రారంభమవుతుంది. నీరజ్ చోప్రా జావెలిన్ విసిరే క్షణం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మూడో త్రైమాసికం (జూలై – సెప్టెంబర్): మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్స్

ఈ కాలం భారత క్రీడారంగానికి అత్యంత కీలకం.

కామన్వెల్త్ గేమ్స్: జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతాయి. అయితే, షూటింగ్, రెజ్లింగ్ లేకపోవడం భారత్‌కు కొంత లోటే.

హాకీ వరల్డ్ కప్: ఆగస్టు 14 నుంచి బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా పురుషుల, మహిళల హాకీ ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.

బీడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ ఛాంపియన్‌షిప్: ఆగస్టు 17 నుంచి ఢిల్లీ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరగనుంది.

ఆసియా క్రీడలు (Asian Games): సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి-నాగోయాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ బంగారు పతకాలు గెలిచిన వారికి ఒలింపిక్ బెర్తులు ఖాయమవుతాయి.

నాలుగో త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్): ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు..

సంవత్సరం చివరలో రెజ్లింగ్ (బహ్రెయిన్), వెయిట్ లిఫ్టింగ్ (చైనా), షూటింగ్ (ఖతార్) విభాగాల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు జరుగుతాయి. ఇక్కడ షూటర్లకు ఒలింపిక్ కోటా స్థానాలు దక్కే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ‘వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్’తో ఏడాది ముగుస్తుంది.