
IND vs ENG Patoudi Trophy Changes: ఇంగ్లీష్ గడ్డపై భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ (IND vs ENG) జరిగే సంగతి తెలిసిందే. అయితే, ఇందులో గెలిచిన జట్టుకు పటౌడీ ట్రోఫీని ప్రదానం చేస్తారు. కానీ, ఇప్పుడు ఈ ట్రోఫీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవును, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దీనిని పరిశీలిస్తోందని తెలుస్తోంది. వార్తల ప్రకారం, ఈ ఏడాది జూన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు ఈ ట్రోఫీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పటౌడీ ట్రోఫీకి గుడ్ బై చెప్పడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తవానికి, క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం జూన్-జులైలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నుంచే ఈ మార్పు అమల్లోకి రావచ్చని చెబుతున్నారు. అయితే, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పటౌడీ ట్రోఫీని ఎందుకు నిలిపివేయాలనుకుంటోంది? దీని వెనుక ఉన్న కారణం ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. కానీ, ఇప్పుడు కొత్త ట్రోఫీని తీసుకురానున్నారనే వార్త వినిపిస్తోంది. దీనికి ప్రస్తుత కాలంలోని దిగ్గజాల పేరు పెట్టనున్నట్లు చెబుతున్నారు.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, పటౌడీ ట్రోఫీని రద్దు చేయాలనే నిర్ణయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఈ నిర్ణయం గురించి ECB దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కుటుంబానికి తెలియజేసినట్లు నివేదికలు ఉన్నాయి. అందువల్ల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రస్తుతానికి దీని గురించి ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వడానికి ఇష్టపడటం లేదని స్పష్టం అవుతోంది.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య పటౌడీ ట్రోఫీ (IND vs ENG) 2007లో ప్రారంభమైంది. ఇంగ్లాండ్‌లో జరిగే ఈ టెస్ట్ సిరీస్ దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు పెట్టారు. అప్పటి నుంచి భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లి మొత్తం 5 సార్లు టెస్ట్ సిరీస్ ఆడింది. అందులో భారత జట్టు ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇంగ్లాండ్ జట్టు మూడుసార్లు గెలిచింది. ఒకసారి సిరీస్ డ్రా అయింది.
భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడటానికి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడల్లా ఆ సిరీస్‌ను పటౌడీ ట్రోఫీ అని పిలుస్తారు. ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడటానికి భారతదేశానికి వచ్చినప్పుడు ఆ సిరీస్‌ను ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ అని పిలుస్తుంటారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అధ్యక్షుడి గౌరవార్థం దీనికి ఆ పేరు పెట్టారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..