
Dhruv Jurel : భారత్ ఏ, సౌతాఫ్రికా ఏ జట్ల మధ్య బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్ సంచలనం సృష్టించాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే అతను ఏకంగా రెండు సెంచరీలు చేసి, టీమిండియా మేనేజ్‌మెంట్ దృష్టిని ఆకర్షించాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ అద్భుత ప్రదర్శన చేసిన ధ్రువ్ జురెల్, రాబోయే సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు సెలక్ట్ చేసే విషయంలో తన వాదనను బలంగా వినిపించడమే కాక టీమ్‌లోని కొన్ని స్థానాలకు పెద్ద ముప్పుగా మారాడు.
భారత ఏ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. జట్టు 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ధ్రువ్ జురెల్ 175 బంతులు ఎదుర్కొని నాటౌట్‌గా 132 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే భారత్ ఏ జట్టు 255 పరుగుల గౌరవప్రదమైన స్కోరును చేరుకోగలిగింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఫామ్‌ను కొనసాగిస్తూ రెండో ఇన్నింగ్స్‌లో కూడా జురెల్ సెంచరీ నమోదు చేశాడు. ఈసారి కూడా భారత్ 104 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, రిషబ్ పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ అయిన తర్వాత ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 159 బంతులను ఎదుర్కొని 12 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో హర్ష్ దూబేతో కలిసి ఆరో వికెట్‌కు 184 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, భారత్ స్కోరును 300 మార్కు దాటించాడు.
సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావడానికి ముందు ధ్రువ్ జురెల్ ఆడిన ఈ రెండు కీలకమైన ఇన్నింగ్స్‌లు, జట్టులో అతని స్థానం గురించి చర్చకు దారితీశాయి. టెస్ట్ సిరీస్‌కు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ మొదటి ప్రాధాన్యతగా ఉండడం దాదాపు ఖాయం. కానీ, అతని తాజా గాయం సమస్యలను సృష్టించే అవకాశం ఉంది.
ధ్రువ్ జురెల్ ఇప్పుడు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానానికి పెద్ద ముప్పుగా మారాడు. గత సిరీస్‌లలో నితీష్ రెడ్డిని బౌలర్‌గా పెద్దగా ఉపయోగించలేదు. బ్యాటింగ్‌లో ధ్రువ్ జురెల్ చూపించిన ఈ అద్భుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే, మెరుగైన బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకునేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపవచ్చు.
జురెల్ బ్యాటింగ్ మాత్రమే కాదు, వికెట్ కీపర్‌గా కూడా జట్టుకు ఉపయోగకరమే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేయగలనని అతను నిరూపించుకోవడంతో సౌతాఫ్రికా పర్యటనలో అతని పాత్ర కీలకం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రదర్శన అతన్ని టెస్ట్ సిరీస్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకోవడంలో సహాయపడుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..