Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీలో ఆల్ టైమ్ రికార్డ్.. ముంబైపై పడిక్కల్ వీరోచిత పోరాటం

Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ మరో అద్భుత రికార్డు సాధించాడు. ముంబైపై 81 నాటౌట్‌తో కర్ణాటక విజయంలో కీలకంగా నిలిచి, రెండు సీజన్లలో 700+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు , 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీలో ఆల్ టైమ్ రికార్డ్.. ముంబైపై పడిక్కల్ వీరోచిత పోరాటం
Devdutt Padikkal

Updated on: Jan 13, 2026 | 8:05 AM

Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ పోరులో దేవదత్ పడిక్కల్ మరోసారి తన సత్తా చాటాడు. ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఒత్తిడిని అధిగమించి 81 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 11 ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించిన పడిక్కల్, కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే పడిక్కల్ ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో రెండు వేర్వేరు సీజన్లలో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా పడిక్కల్ రికార్డు సృష్టించాడు. గతంలో పృథ్వీ షా, మయంక్ అగర్వాల్ వంటి దిగ్గజాలు ఒక సీజన్‌లో ఈ మార్కును దాటినా, రెండు సార్లు ఈ ఫీట్ సాధించడం మాత్రం ఒక్క పడిక్కల్‌కే సాధ్యమైంది.

ప్రస్తుత సీజన్‌లో పడిక్కల్ ఫామ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆడిన 8 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 721 పరుగులు బాదాడు. ఇందులో 4 సెంచరీలు , 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తూ, కీలక సమయాల్లో బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. ఇన్ని సెంచరీలు, ఇన్ని పరుగులు చూస్తుంటే పడిక్కల్ టీమిండియా తలుపులు మరోసారి గట్టిగా తడుతున్నాడని స్పష్టమవుతోంది. క్లాసిక్ షాట్లతో పాటు వేగంగా పరుగులు రాబట్టడంలో పడిక్కల్ తనదైన ముద్ర వేస్తున్నాడు.

ముంబైతో జరిగిన ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. షమ్స్ ములానీ 86 పరుగులతో రాణించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటకకు పడిక్కల్, కరుణ్ నాయర్ గట్టి పునాది వేశారు. కర్ణాటక 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 187 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆట సాధ్యం కాకపోవడంతో వీజేడీ పద్ధతి ప్రకారం కర్ణాటకను 55 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు. పడిక్కల్‌కు తోడుగా కరుణ్ నాయర్ కూడా 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో తోడ్పడ్డాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..